Virat Kohli: ఐపీఎల్ 2024లో కోహ్లి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తొమ్మిది మ్యాచుల్లో 430 ర‌న్స్ చేసిన కోహ్లి ఈ సీజ‌న్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. గురువారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై కోహ్లి హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. 43 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 51 ర‌న్స్ చేశాడు.

కోహ్లితో పాటు ర‌జ‌త్ పాటిదార్ కూడా రాణించ‌డంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. అయితే మ్యాచ్‌లో టీ20 శైలికి భిన్నంగా కోహ్లి బ్యాటింగ్ సాగింది. ఆరంభంలో ధాటిగా ఆడిన కోహ్లి ఆ త‌ర్వాత ఎక్కువగా సింగిల్స్ మాత్ర‌మే తీశాడు. కోహ్లి ఆట‌తీరును టీమిండియా లెజెండ‌ర్ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ త‌ప్పుప‌ట్టాడు. జ‌ట్టు స్కోరు కంటే త‌న హాఫ్ సెంచ‌రీ చేయ‌డ‌మే ముఖ్యం అన్న‌ట్లుగా స‌న్‌రైజ‌ర్స్‌పై ఆడాడ‌ని సునీల్ గ‌వాస్క‌ర్ అన్నాడు.

సింగిల్స్ మాత్ర‌మే…

“సింగిల్స్‌..సింగిల్స్‌..సింగిల్స్‌…కోహ్లి బ్యాటింగ్ మొత్తం ఇలాగే సాగింది. వ్య‌క్తిగ‌త స్కోరు 32 ప‌రుగుల వ‌ద్ద నుంచి కోహ్లి ఒక్క‌, ఫోరు, సిక్స‌ర్ కొట్ట‌లేదు. మొత్తం సింగిల్స్ మాత్ర‌మే తీశాడు. తొలి ఓవ‌ర్ నుంచి ప‌దిహేనో ఓవ‌ర్ వ‌ర‌కు బ్యాటింగ్ చేసిన‌ కోహ్లి 118 స్ట్రైక్ రేట్‌తో కేవ‌లం 51 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.

ఓ వైపు ర‌జ‌త్ పాటిదార్ 19 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ చేస్తే కోహ్లి మాత్రం ఫోర్ కొట్ట‌డానికే ఇబ్బంది ప‌డ్డాడు” అని సునీల్ గ‌వాస్క‌ర్ అన్నాడు. కోహ్లి నుంచి ఆర్‌సీబీ ఇలాంటి ఆట‌ను ఆశించ‌డం లేద‌ని, త‌న రికార్డులే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా కోహ్లి ఆట సాగింద‌ని సునీల్ గ‌వాస్క‌ర్ అన్నాడు.

రిస్క్‌లు చేయాలి…

“కార్తిక్‌, లోమ్రార్‌తో పాటు చాలా మంది హిట్ట‌ర్లు జ‌ట్టులో ఉన్నారు. ఆర్‌సీబీ ఎక్కువ వికెట్ల‌ను కోల్పోలేదు. అలాంటి టైమ్‌లో రిస్క్‌లు తీసుకోవాలి. ఫోర్లు, సిక్స‌ర్లు కొట్టాలి. కానీ కోహ్లి మాత్రం రిస్క్ లేకుండా సింగిల్స్ తీశాడు. మిడిల్ ఓవ‌ర్‌లో పూర్తిగా ట‌చ్ కోల్పోయాడు. తాను ఎదుర్కొన్న తొలి 11 బాల్స్‌లో 23 ప‌రుగులు చేసిన కోహ్లి…ఆ త‌ర్వాత 28 ప‌రుగులు చేయ‌డానికి 32 బాల్స్ తీసుకున్నాడు. టీ20ల్లో ఇలా ఇడితే క‌ష్టం” అని సునీల్ గ‌వాస్క‌ర్ అన్నాడు.

ర‌జ‌త్ పాటిదార్ హాఫ్ సెంచ‌రీ…

ఈ మ్యాచ్‌లో కోహ్లి నెమ్మ‌దిగా ఆడిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాత్రం విజ‌యం అందుకున్న‌ది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 206 ప‌రుగులు చేసింది. ర‌జ‌త్ పాటిదార్ ఇర‌వై బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 50 ర‌న్స్ చేశాడు. కోహ్లి కూడా హాఫ్ సెంచ‌రీ సాధించ‌డంలో బెంగ‌ళూరు భారీ స్కోరు చేసింది.

రెండో విక్ట‌రీ…

ల‌క్ష్య‌ఛేద‌న‌లో త‌డ‌బ‌డిన స‌న్‌రైజ‌ర్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 35 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 13 బాల్స్‌లో మూడు ఫోర్లు రెండు సిక్స‌ర్ల‌తో 31 ప‌రుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.

కానీ ట్రావిస్ హెడ్‌, క్లాసెన్‌, మార్‌క్ర‌మ్‌, నితీష్ రెడ్డి విఫ‌లం కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోయింది. షాబాజ్ అహ్మ‌ద్ 40, క‌మిన్స్ 31 ప‌రుగులు చేసిన ధాటిగా ఆడ‌లేక‌పోయారు. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీకి ఇది రెండో విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఏడింటిలో ఓట‌మి పాలైంది. రెండు మ్యాచుల్లో మాత్ర‌మే విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉంది.