Dal water: పప్పు నీళ్లను దాల్ వాటర్ లేదా దాల్ కా పానీ అని పిలుస్తూ ఉంటారు. ప్రతిరోజూ పప్పన్నం తినే వారి సంఖ్య ఎక్కువే. కాబట్టి ఆ పప్పు వండుకునే రోజు కచ్చితంగా పప్పు నీళ్లను కూడా తాగండి. ప్రతిరోజూ తాగితే ఇంకా మంచిది. పప్పులో ఉండే పోషకాలన్నీ ఈ పప్పు నీళ్లలో ఉంటాయి. ప్రోటీన్, క్యాల్షియం, పొటాషియం, ఫోలేట్, ఐరన్ ఇలా అన్నింటిని పప్పు నీళ్లు అందిస్తాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

పప్పు నీళ్లలో ఇంగువ వేస్తే…

పప్పు నీళ్లు చప్పగా ఉంటాయి కదా అనుకోవచ్చు. కాస్త టేస్టీగా చేసుకుంటే అవి కూడా రుచిగానే ఉంటాయి. కుక్కర్లో అరకప్పు కంది పప్పు శుభ్రంగా కడిగి వేయండి. కాస్త పసుపు పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. నీళ్లు నాలుగు గ్లాసులు వేయండి. ఇలా వేయడం వల్ల పప్పు నీళ్లు అధికంగా వస్తాయి. ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. తరువాత వడకట్టి పప్పును, పప్పు నీళ్లను వేరు చేయండి. ఇప్పుడు ఆ పప్పు నీళ్లలో కాస్త తాళింపు వేయండి. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి, కాస్త ఇంగువను చల్లండి. ఈ మిశ్రమాన్ని పప్పు నీళ్లలో వేసుకోండి. అంతే టేస్టీ దాల్ వాటర్ రెడీ అయినట్టే. ఇది రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నెలల పిల్లలకు దీన్ని కొంచెం కొంచెం పడితే ఎంతో మంచిది. ఆరు నెలలు దాటిన పిల్లలకు రెండు మూడు స్పూన్లు పడితే ఆరోగ్యం. ఏడాదిన్నర వయసు దాటిన పిల్లలకు ఒక చిన్న గ్లాస్ తో ఈ పప్పు నీళ్లను పట్టవచ్చు.

కందిపప్పుతో చేసిన ఈ పప్పు నీళ్లను తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. చురుకుగా పనిచేస్తారు. ఈ పప్పు నీళ్లలో కాస్త ఇంగువ జోడించడం వల్ల పప్పు నీళ్లకు మంచి వాసన వస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బ్రాంకైటిస్, కిడ్నీ స్టోన్స్ వంటి వాటికి కూడా చికిత్సను అందిస్తుంది.

ఈ పప్పు నీళ్లకు ఇంగువతో పాటు, వెల్లుల్లి పొడిని కూడా జోడించుకుంటే ఇంకా మంచిది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటుంది. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఈ పప్పు నీళ్లను సూప్‌లా తయారు చేసుకుని తాగవచ్చు. దీనిలో వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం వంటివన్నీ జోడించి టేస్టీ సూప్ ను కూడా వండుకోవచ్చు. ఈ పప్పు నీళ్లను కొన్ని రకాల కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఇగురు గట్టి పడి చిక్కగా అవుతుంది.

చపాతీలు కలుపుతున్నప్పుడు సాధారణ నీటితో పాటు ఈ పప్పు నీళ్లను వేస్తే చపాతీలు చాలా రుచిగా వస్తాయి. ఈ పప్పు నీళ్లను అన్ని వయసులవారు తాగవచ్చు. ఆరు నెలలు వయసు దాటిన పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్లు దాటిన ముసలి వారి వరకు ఎవరైనా దీనిని తాగవచ్చు. అయితే ఆరు నెలల నుంచి 12 నెలల లోపు పిల్లలకు మితంగానే వీటిని పట్టాలి. ఎందుకంటే వారికి అరిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. రెండు మూడు స్పూన్లతో మొదలుపెట్టి ఏడాది వయసు వచ్చేసరికి ఓ అయిదు స్పూన్ల వరకు తాగించవచ్చు.