IPL 2024 SRH vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‍లో రికార్డుల మోతతో జోష్ మీద ఉన్న సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఎదురుదెబ్బ తగిలింది. హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‍ నేడు (ఏప్రిల్ 25) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. దీంతో నాలుగు వరుస విజయాల తర్వాత ఎస్ఆర్‌హెచ్‍కు ఓటమి ఎదురైంది. ఉప్పల్ మైదానం వేదికగా నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో హైదరాబాద్ 35 పరుగుల తేడాతో బెంగళూరుపై పరాజయం పాలైంది. వరుసగా ఆరు ఓటముల తర్వాత ఆర్సీబీ ఓ గెలుపు రుచిచూసింది. ఈ సీజన్‍లో రెండో విజయాన్ని నమోదు చేసి..ప్లేఆఫ్స్ ఆశలను ఇంకా నిలుపుకుంది.

పదిరోజుల క్రితం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 284 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరుతో హైదరాబాద్ విరుచుకుడింది. ఫస్ట్ బ్యాటింగ్‍లో మరోసారి సూపర్ అనిపించుకుంది. అయితే, నేడు హోం గ్రౌండ్‍లో ఛేజింగ్‍లో చతికిలపడింది. కనీస పోటీ లేకుండానే ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయింది. ఇక హైదరాబాద్‌పై బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. అలాగే, ఇది ఆర్సీబీ ఫ్రాంచైజీకి 250వ మ్యాచ్ కావడం మరింత స్పెషల్‍గా ఉంది. 

కుమ్మేసిన పాటిదార్.. కోహ్లీ హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ (43 బంతుల్లో 51 పరుగులు; 4 ఫోర్లు, సిక్స్) నిలకడైన అర్ధ శకతంతో రాణిస్తే.. రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50 పరుగులు; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. రజత్ దూకుడుతో ఆర్సీబీకి మంచి స్కోరు వచ్చింది. మయాంక్ మార్కండే వేసిన ఓ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లతో విధ్వంసం చేశాడు పాటిదార్. కామెరూన్ గ్రీన్ (20 బంతుల్లో 37 రన్స్ నాటౌట్) కూడా బాగా ఆడాడు.

సన్‍రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ 3 వికెట్లతో రాణించగా.. నటరాజన్ రెండు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండే తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

సన్‍రైజర్స్ ఢమాల్

లక్ష్యఛేదనలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. వరుసగా వికెట్లు కోల్పోయి నిరాశపరిచింది. ఒక్క 50 పరుగుల భాగస్వామ్యం కూడా రాలేదు. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది ఎస్ఆర్‌హెచ్. ఈ సీజన్‍లో భీకర ఫామ్‍లో ఉన్న ట్రావిస్ హెడ్ (1).. ఆర్సీబీ పేసర్ జాక్స్ వేసిన తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31 పరుగులు) మరోసారి మెరిపించినా.. నాలుగో ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఐడెన్ మార్క్‌రమ్ (7), హెన్రిచ్ క్లాసెన్ (7), నితీశ్ కుమార్ రెడ్డి (13), అబ్దుల్ సమాద్ (10) ఎక్కువ సేపు నిలువలేదు. పరుగులు కూడా మందకొడిగా వచ్చాయి. బెంగళూరు బౌలర్లు క్రమంగా వికెట్లు తీసి.. హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశారు.

హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31 పరుగులు) కాసేపు దూకుడుగా ఆడాడు. చివర్లో షాబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 పరుగులు నాటౌట్) పర్వాలేదనిపించాడు. జట్టు ఆలౌట్ కాకుండా కాపాడాడు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. విల్ జాక్స్, యశ్ దయాళ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

మూడో ప్లేస్‍లోనే హైదరాబాద్

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍ల్లో 5 గెలిచి.. మూడు ఓడింది సన్‍రైజర్స్ హైదరాబాద్. దీంతో 10 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలోనే కొనసాగింది. ఇక, 9 మ్యాచ్‍ల్లో ఏడు ఓడి, రెండు గెలిచింది బెంగళూరు. అయితే, పాయింట్ల పట్టికలో పదో స్థానంలోనే కంటిన్యూ అయింది.