Inter Students Killed: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే బైక్ పై వెళ్తున్న నలుగురు ఇంటర్ విద్యార్ధులు ఓ ప్రైవేటు బస్సు ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డు ప్రమాదంలో నలుగురు 4killed ఇంటర్ విద్యార్ధులు చనిపోవడం గ్రామంలో విషాదం నింపింది.

ఈ ఘటన వర్ధన్నపేట శివారు ఆకేరు వాగు బ్రిడ్జి Akeru Bridge వద్ద బుధవారం రాత్రి జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Vardhannapet వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్,  Illandaఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సిద్దు, వరుణ్ తేజ్, పొన్నాల రనీల్ కుమార్ స్నేహితులు. అందరూ కలిసి ఇంటర్ పూర్తి చేశారు.

ఈ క్రమంలోనే బుధవారం ఇంటర్ ఫలితాలు వెలువడగా.. పక్కపక్కన ఉండే గ్రామాలే కావడంతో సాయంత్రం నలుగురు స్నేహితులూ కలిశారు. అనంతరం ఒకే బైక్ పై నలుగురు ఇల్లంద నుంచి వర్ధన్నపేటకు వెళ్తున్నారు. వరంగల్ నగర శివారు మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభకు జనాలను తీసుకు వెళ్లిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తిరుగు ప్రయాణమైంది.

ఆ బస్సు వర్ధన్నపేట శివారు ఆకేరు వాగు బ్రిడ్జి వద్దకు చేరుకోగా.. బైక్ పై వెళ్తున్న నలుగురు స్నేహితులు అతి వేగంగా ఆ బస్సును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్‌, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్‌ తేజ్‌, పొన్నాల రనిల్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు.

తల, ఛాతి భాగంలో తీవ్ర గాయాలు కావడం, రక్త స్రావం ఎక్కువగా జరగడంతో గణేశ్, సిద్దు, వరుణ్ తేజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రనీల్ కుమార్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.

దీంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, రనీల్ కుమార్ ను అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎంకు చేరుకున్నారు.కాగా ఎంజీఎం ఎమర్జెన్సీ వార్డులో రనీల్ ను అడ్మిట్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.

గ్రామంలో తీవ్ర విషాదం

అతివేగంగా బస్సును ఢీ కొట్టడంతో బైక్ మొత్తం నుజ్జునుజ్జుకాగా నలుగురు దాదాపు 50 మీటర్ల వరకు ఎగిరిపడ్డారు. రెండు వాహనాలు అతివేగంలో ఉండటం ప్రమాద తీవ్రతను పెంచినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఇంటర్ పాసైన సంబరం కాస్త విషాదానికి దారి తీయగా.. ఇల్లంద, వర్ధన్నపేటలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులంతా వారి వారి కుటుంబాలకు ఒక్కరే కొడుకు కావడం, చేతికి అందివచ్చిన కొడుకు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

తరచూ ప్రమాదాలు…

వరంగల్–ఖమ్మం హైవేపై వర్ధన్నపేట, ఇల్లంద శివారులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో మూల మలుపులు ఎక్కువగా ఉండటం, వాహనాల అతివేగం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు ప్రమాదాలు జరిగి, పలువురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలసిందిగా గ్రామస్థులు చాలాసార్లు అధికారులకు విన్నవించారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతోనే ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా నేషనల్ హైవే, పోలీస్ ఆఫీసర్లు తగిన చర్యలు చేపట్టి ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని వర్ధన్నపేట, ఇల్లంద గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)