Inter Student Suicide: చదువే జీవితంకాదని ఆ చిన్నారులు గ్రహించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు. ఆత్మ న్యూనతతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం.

పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఏమరపాటు కారణంగా రెప్ప పాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

ఖమ్మం Khammam జిల్లా ముదిగొండ Mudigonda మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ Inter First year మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ళ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మంలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న ఆ విద్యార్థిని బుధవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో అనుత్తీర్ణత సాధించింది.

అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ చిన్నారి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఖమ్మంలో ఒక శుభ కార్యానికి హాజరవడంతో ఆ బాలిక తన పరీక్షా ఫలితాలను చూసుకుని తల్లడిల్లింది.

ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఇంటి పక్కన వాళ్ళకి ఫోన్ చేసి చూడమని చెప్పారు. వారు ఇంట్లో గమనించగానే అప్పటికే ఆ బాలిక ఉరి కొయ్యకు వేలాడుతూ ఉంది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చిన్నారి మృతదేహం చూసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆందోళన వద్దు..

జిల్లాలోని విద్యార్థులు వారి తల్లి దండ్రులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఒక విజ్ఞప్తి చేసింది. SSC, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు వెలువడుతున్న ఈ సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైన ఆందోళనకు, ఒత్తిడికి గురి కావద్దని డీఎం అండ్ హెచ్ఓ మాలతి పేర్కొన్నారు.

తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు వైద్యున్ని, ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులను, ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. ఇంకా మరిన్ని సలహాలు, సూచనలను పొందటం కోసం టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు పొందవచ్చని వివరించారు.

చిరాకు పడకం, ఆసక్తిని కోల్పోవడం, నిద్రలేమి, అపరాధ భావం, నిరాశావాదం, నిస్సహాయత, ఆత్మ హత్య చేసుకోవలనిపించడం, ఒంటరిగా ఉండాలనుకోవడం తదితర లక్షణాలు కనబడితే మానసిక ఉత్తిడికి గురైనట్లు భావించాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా పరీక్షల ఉత్తీర్ణత సమయంలో ఫెయిల్ ఆయినా విధ్యార్థులు ఆందోళన పడనవసరం లేదని, సంప్లిమెంటరీ పరీక్షలలో వారికి విజయం వరిస్తుందన్న విషయాన్ని గుర్తించాలని తెలిపారు. వీరిపై తల్లిదండ్రులు ఎవ్వరు ఒత్తిడి చేయడం, విసుగు చెందడం చేయకూడదని వివరించారు.

మానసిక ఒత్తిడిని జయించటం కోసం ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయమం, సరైన నిద్ర సరదాగ స్నేహితులతో గడపటం చేయాలని తెలిపారు. తల్లి దండ్రులు ఎప్పుడు పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకుండా వారిని తక్కువ భావానికి గురి చేయకుండా ఉండాలని సూచించారు. పిల్లలు ఒత్తిడికి ఏమైనా గురైనట్లు అనిపిస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలని పేర్కొన్నారు.

(రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రతినిధి.)