posted on Apr 25, 2024 9:14AM

ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్  హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురు పేర్ల‌ను అధిష్టానం ప‌రిశీలించింది. అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చివ‌ర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. త‌ద్వారా పార్ల‌మెంట్ ప‌రిధిలోని రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకొచ్చేలా కాంగ్రెస్ వ్యూహం రచించిందని జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. 

 

తెలంగాణ‌లో మొత్తం 17లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 12 నుంచి 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని పార్టీ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థుల విజ‌యంకోసం కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. అయితే  ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై అధిష్టానం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింది. గురువారంతో నామినేష‌న్ల గ‌డువు ముగుస్తుండ‌టంతో బుధ‌వారం రాత్రి  మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది.

ఖమ్మం  లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఖ‌మ్మం లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం భారీ  క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్లు ప‌రిశీలించింది. జిల్లాలోని పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన అధిష్టానం.. మెజార్టీ అభిప్రాయాల మేర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురాంరెడ్డి పేరు ఖరారుచేసింది. ఖ‌మ్మం పార్ల‌మెంట్ సీటును త‌మ అనుచ‌రుల‌కే ద‌క్కేలా జిల్లాలోని ముగ్గురు మంత్రులు పోటీ ప‌డ్డారు. అయితే, సామాజిక వ‌ర్గాల వారీగా లెక్క‌ల‌ను బేరీజు వేసుకొని అధిష్టానం చివ‌రికి  పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు ర‌ఘురామిరెడ్డి పేరును అధిష్టానం  ఖరారు చేసి అధికారికంగా ప్ర‌క‌టించింది.

రామ స‌హాయం రఘురామి రెడ్డికి రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగానూ బ‌ల‌మైన వ్య‌క్తి. గ‌తంలో మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయ‌నకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డేకాక‌..  సినీ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా   వియ్యంకుడే. హీరో వెంక‌టేశ్ కుమార్తె అశ్రిత‌ను ఆయ‌న పెద్ద కుమారుడు వినాయ‌క్ రెడ్డి వివాహం చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కుమార్తె స్వ‌ప్నిరెడ్డిని ఆయ‌న చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నాడు. అయితే  ఖ‌మ్మం లోక్‌స‌భ‌ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ ఎస్‌ నేత నామా నాగేశ్వ‌ర‌రావు ఉన్నారు. మ‌రోసారి బీఆర్ ఎస్ అధిష్టానం ఆయ‌న‌కే టికెట్ ఇచ్చింది. నామా నాగేశ్వ‌ర‌రావు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. రాష్ట్రంలో ప‌దిహేడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం తొలుత ప్ర‌క‌టించిన 14 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి  అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో, ఖ‌మ్మం నుంచి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్  అధిష్టానం మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికే  టికెట్‌ కేటాయించింది. రామ‌స‌హాయంకు టికెట్ కేటాయించ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌ధాన పార్టీలు క‌మ్మ సామాజిక వ‌ర్గం వ్య‌క్తికే టికెట్ కేటాయిస్తూ వ‌స్తున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం అదే విధానాన్ని కొన‌సాగిస్తూ నామా నాగేశ్వ‌ర‌రావునే మ‌రోసారి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది. ఖ‌మ్మంలో  తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వారు నామావైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో నామాకు గ‌ట్టిపోటీ ఇచ్చేలా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును బ‌రిలోకి దింపాల‌ని  కాంగ్రెస్ అధిష్టానం ఒక దశలో భావించింది.  అయితే స్థానికేతరుడు అన్న అభ్యంతరాలు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్య‌క్తి కావడంతో  అధిష్టానం మండ‌వ పేరును ప‌క్క‌న పెట్టింది. నామాను ఢీకొట్టేందుకు కమ్మ సామాజిక వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన నేత లేక‌పోవ‌టంతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి   వియ్యంకుడు అయిన రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైన‌ల్ చేసింది. రామ స‌హాయంకు విక్ట‌రీ వెంక‌టేశ్ కుటుంబంతో బంధుత్వం ఉండ‌టంతో ఖ‌మ్మం పార్ల‌మెంట్ ప‌రిధిలో రెండు బ‌ల‌మైన‌ సామాజిక  వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంటుంద‌ని అధిష్ఠానం భావించినట్లు కనిపిస్తోంది.   కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాల్సిందే.