posted on Apr 24, 2024 2:58PM

మొద‌టి ద‌శ పోలింగ్ త‌రువాత బీజేపీలో ఎందుకు టెన్ష‌న్ పెరిగింది. మ‌రో వైపు యూపీపై ఆ పార్టీ ఎందుకు ప‌ట్టు కోల్పోతోంది. యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో రాజకీయంగా అత్యంత కీలకమైన భూమిక పోషించే జాట్లు, బీజేపీ పట్ల వ్యతిరేకంగా మారిపోయారు. గ‌తంలో ఈ సామాజిక వర్గం అండ‌తోనే బీజేపీ రికార్డు స్థాయి విజయాలను సొంతం చేసుకుంది.  వాస్త‌వానికి బీజేపీ బలం అంతా ఉత్తరాదిలోనే ఉంది. బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలే అని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. మొత్తం 542 ఎంపీ సీట్లలో సగానికి పైగా ఉత్తరాదిలో రాష్ట్రాల్లోనే  ఉన్నాయి. దాంతో బీజేపీకి ఎపుడు విజయం ఉత్తరాది నుంచే దక్కుతూ వ‌చ్చింది. అయితే  ఇప్పటికే రెండు ఎన్నికల్లో బీజేపీని గెల‌పించిన ఉత్తరాది ప్ర‌జ‌లు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన దాని కంటే సీట్లు తగ్గుతాయని బీజేపీ నేత‌లే అంటున్నారు. 

2019లో బీజేపీ ఉత్తరాదిన గెలుచుకున్న సీట్లు 260. అయితే ఈ సీట్ల‌లో ఈ సారి యాభై సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే అపుడు 210 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయి. ఇది నిజంగా బీజేపీకి చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎందుకంటే మెజారిటీ కి మ్యాజిక్ ఫిగర్ 273 గా ఉంది. దానికి అరవై సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోతే ఆదుకోవాల్సింది కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలే. లేకపోతే బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించి అధికారంలోకి రావడం అన్నది సాధ్యపడదు. 2019 ఎన్నికల్లో చూసుకుంటే రాజస్థాన్ లో మొత్తం పాతికకు పాతిక సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 10 సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌. అలాగే బీహార్ లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉంటే 38 గెలుచుకుంది. ఈసారి అలా కుదరదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు పుంజుకున్నాయి. దాంతో పది సీట్లు నష్టపోతుందనే అంచ‌నా.

అదే విధంగా చూస్తే కనుక గుజరాత్ మొత్తం 26 ఎంపీ సీట్లనూ స్వీప్ చేసింది బీజేపీ. ఈసారి కనీసంగా రెండు ఎంపీ సీట్లు అయినా బీజేపీ నష్టపోతుంద‌ట‌. అలాగే హర్యానాలో నాలుగు సీట్లు బీజేపీ ఓడిపోతుందట‌. ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లు ఉంటే అందులో ఏడింటికి ఏడూ 2019లో బీజేపీ ఖాతాలో పడ్డాయి. కానీ ఈసారి చూస్తే కనుక బీజేపీకి అయిదు దాకా వస్తాయని అంటున్నారు. అంటే రెండు ఎంపీ సీట్లు నష్టపోక తప్పదు. కర్నాటకలో 28 ఎంపీ సీట్లలో పాతిక దాకా బీజేపీ గెలుచుకుంది. ఈసారి పది ఎంపీ సీట్లు బీజేపీ నష్టపోతుందని అంచనాలు ఉన్నాయి. కర్నాటలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ కూడా గట్టిగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏకపక్ష విజయాలు ద‌క్క‌వు. ఉత్తర భారతాన బీజేపీ యాభైకి పైగా ఎంపీ సీట్లు నష్టపోవడానికి కారణాలు చూస్తే కనుక అక్కడ చాలా రాష్ట్రాలలో బలంగా ఉన్న రాజ్ పుట్ లు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి ఒకనాడు రాజ్ పుట్ లు బలంగా మద్దతు ఇస్తూ ఉండేవారు. ఈసారి వారు మనసు మార్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వారు వ్యతిరేకిస్తున్నారు.

రాముడు రాముడే.. రాజకీయం రాజకీయమే… ఓటు ఓటే… అంటున్న 3 కోట్ల మంది రాజపుత్రులు

బిజెపి మోడీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అరాచకాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్య‌క్తం అవుతుంది.  మొదటి దశ ఎన్నికల అనంతరం నిర్వహించిన లోక్ పోల్ సర్వేలో ఉత్తర భారతం నుంచి బీజేపీకి చెప్పుకోదగ్గ ఆధిక్యం ఏమీ లేదని తేలింది. బీజేపీ హయాంలో ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపిన తీరు, నల్లచట్టాలు తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడిన తీరు, రెజ్లర్ కూతుళ్లను రోడ్డున పడేసిన తీరుపై హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న జాట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత కిరోడిలాల్ మీనా  సామాజికవర్గం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతోందని అంతర్గతంగా వార్తలు వస్తున్నాయి.  

అలాగే బీజేపీ ప్రభుత్వం, రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడిని లాగి, తలపాగా విసిరి, పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు, అప్పటి నుంచి రాజ్‌పుత్ సమాజం మొత్తం బీజేపీకి ఓటు వేయబోమని ప్రమాణం చేసింది.  దీని వల్ల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలో బీజేపీకి భారీ నష్టం వాటిల్లనుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దాదాపు అన్ని స్థానాల్లో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నప్పటికీ, త్యాగి మరియు సైనీ వర్గాలకు చెందిన అభ్యర్థులను బిజెపి టికెట్లు ఇచ్చి నిలబెట్టలేదు. దీంతో అస‌హ‌నంతో వున్న ఆ రెండు వర్గాల వారు  బిజెపికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో వివిధ చోట్ల పంచాయితీలు చేస్తున్నారు. అంతే కాదు  గుర్జర్ సామాజికవర్గ ప్రతినిధులను టిక్కెట్ ఇవ్వ‌కుండా దూరంగా ఉంచింది, దీంతో చాలా మంది గుర్జర్ నాయకులు బిజెపికి వ్యతిరేకంగా గళం విప్పారు. వరుసగా 10 సంవత్సరాలుగా గుర్జర్ సామాజికవర్గ ప్రజలకు తగిన వాటా లభించలేదు.  దీని ప్రభావం రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో స్ప‌ష్టంగా కనిపిస్తుంది.

ఈసారి కాశ్మీర్‌లో కూడా అనేక ప్రజా సంఘాలు మరియు కాశ్మీరీ పండిట్ల సంస్థలు బిజెపిపై తమ ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నాయి.  ఇది జమ్మూ,  కాశ్మీర్‌లో బిజెపికి ఓట్లను తగ్గిస్తుంది. గ‌త రెండు ఎన్నిక‌ల‌తో పోల్చితే, ఈ ఎన్నికల్లో బీజేపీపై పలు వర్గాల ఆగ్రహావేశాలకు లోనుకావాల్సి వస్తోందని తాజా సర్వేలో తేలింది.  ఈ కారణంగానే బీజేపీ ఓటర్లు ఫ‌స్ట్ ఫేజ్‌లో ఓటు వేసేందుకు బయటకు రాలేదు.  తదుపరి దశ పోలింగ్‌లో బీజేపీ మద్దతుదారుల ఆగ్రహం తగ్గుతుందా? ఇదే బీజేపీ అధిష్టానానికి వేధిస్తున్న ప్ర‌శ్న‌. 

– ఎం.కె. ఫ‌జ‌ల్‌