posted on Apr 24, 2024 2:46PM

గత ఎన్నికల సమయంలో అన్నీ అలా కలిసి వచ్చిన జగన్ కు ఈ సారి మాత్రం ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో తనకు సానుభూతి సంపాదించి పెట్టిన కోడి కత్తి దాడి, బాబాయ్ హత్య ఇప్పుడు ఎదురు తిరిగి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి. పోనీ కొత్తగా సానుభూతి కోసం రాయి దాడి అంటూ హడావుడి చేస్తే అది కాస్తా సానుభూతి మాట అటుంచి నవ్వుల పాలు చేసింది. ఏపీలో ఇప్పుడు జగన్ తరహాలో కంటిపై బ్యాండేజీ పెట్టుకుని తిరగడం యూత్ లో ఒక కొత్త ట్రెండీ ఫ్యాషన్ గా మారిపోయింది. గోదారోళ్ల ఎటకారాన్ని మించిపోయింది. 

ఇవన్నీ ఒకెత్తయితే.. వ్యూహాత్మకంగా ఆయన సిట్టింగులను మార్చిన తీరు ఇప్పుడు  పలు నియోజక వర్గాలలో  వైసీపీని విజయానికి దూరం చేయడం ఖాయంగా మారింది. అలాంటి నియోజకవర్గాలలో ఇప్పుడు మాడుగుల అసెంబ్లీ, అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గాలు చేరాయి. పోలింగ్ కు ముందే ఈ రెండు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థుల ఓటమి ఖరారైపోయిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతూ చేతులెత్తేశాయి. 

ముందుగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం నుంచి కూటమి మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటైన అభ్యర్థి అని భావించి సీఎం జగన్  మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి బూడి ముత్యాల నాయుడిని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. నియోజకవర్గం మార్పునకు బూడి ముత్యాల నాయుడిని ఒప్పించడంలో భాగంగా మాడుగుల టికెట్ ను ఆయన కుమార్తె అనూరాథకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. 

ఫలితం ఇప్పడు ఈ రెండు నియోజకవర్గాలలోనూ కూడా వైసీపీ ఓటమి ఖాయమని ఆయన పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మాడుగుల నుంచి బూడిని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపడానికి జగన్ సామాజిక సమీకరణాలను ఆధారంగా తీసుకున్నారు. అనకాపల్లి నుంచి బరిలోకి దిగిన సీఎం రమేష్ కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. అనకాపల్లి లోక్ సభ పురిధిలో ఆ సామాజిక వర్గ ఓటర్లు నాలుగు లక్షల పై చిలుకు ఉన్నారు. దీంతో జగన్ అదే సమాజికవర్గానికి చెందిన బూడిని ఇక్కడ నుంచి బరిలోకి దింపారు.  బూడి స్థానికత ప్లస్ అవుతుందనీ, విజయానికి దోహదపడుతుందనీ జగన్ భావించారు.

అయితే అనకాపల్లిలో కాపు సామాజిక ఓటర్లు  కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ సామాజికవర్గ ఓటర్లు 5 లక్షల పై చిలుకు ఉన్నారు. జనసేన కూటమి భాగస్వామ్య పార్టీయే కావడం సీఎం రమేష్ కు కలిసి వచ్చింది. అంతే కాకుండా సీఎం రమేష్ కు మెగా స్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ గంపగుత్తగా ఆయనకే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత కారణంగా కొప్పుల వెలమ సామాజిక వర్గంలో  మెజారిటీ సీఎం రమేష్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో  జగన్ ఎత్తుగడ ఘోరంగా విఫలమైంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ విజయం నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

ఇప్పుడిక మాడుగుల విషయానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి బూడి ముత్యాలనాయుడు రెండు సార్లు విజయం సాధించారు. ఆయనకు నియోజకవర్గంపై గట్టి పట్టు కూడా ఉంది. అయితే  జగన్ బూడిని మార్చి ఆయన కుమార్తె అనూరాథను ఇక్కడ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ నిర్ణయం బూడి కుటుంబంలో చిచ్చుకు కారణమైంది. తన తండ్రి స్థానం నుంచి తానే పోటీ చేస్తానంటూ బూడి కుమారుడు రవి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు. పోటీ నుంచి వైదొలగడానికి ససేమిరా అంటున్నారు. ఈ పరిణామం ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు సత్యనారాయణ మూర్తికి ఆయాచిత లబ్ధిగా మారింది.

పెందుర్తి సీటు ఆశించిన బండారు సత్యనారాయణమూర్తి  ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో చివరి నిముషంలో మాడుగుల బరిలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తికి లాభం చేకూరుతుంది. పెందుర్తి సీటును జనసేనకు ఇవ్వడంతో బండారు చొవరి నిముషంలో మాడుగులకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ బండారుకు వైసీపీయే విజయాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగించినట్లైంది.  జగన్ వ్యూహ వైఫల్యం అనకాపల్లి లోక్ సభ, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ పరాజయాన్ని ఖరారు చేసినట్లైందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.