Smoothie for weight loss: వేసవిలో బరువు తగ్గే ఆహారాన్ని తినడం ద్వారా త్వరగా బరువు తగ్గొచ్చు. అలాగే సాధారణంగా కూడా శీతాకాలంతో పోలిస్తే వేసవిలో మనకు తెలియకుండానే బరువు తగ్గుతాము. తేలికపాటి ఆహారం తినడం ద్వారా మరింత త్వరగా కరిగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మేము అవకాడో బనానా స్మూతీ రెసిపీ ఇచ్చాము. దీనిని ఒక పూట ఆహారంగా తీసుకొని భోజనం మానేయండి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందడంతో పాటు కొవ్వుల్లాంటివి శరీరానికి అందవు. కాబట్టి త్వరగా మీరు బరువు తగ్గొచ్చు. అవకాడో బనానా స్మూతీ చేయడం కూడా చాలా సులువు. అవి కూడా ఖరీదు కదా అనుకోవచ్చు. ఈ అవకాడో బనానా స్మూతీలో అవకాడో అర ముక్క వేస్తే చాలు. దీన్ని వండాల్సిన అవసరం లేదు, కాబట్టి సులువుగా అయిపోతుంది. ఇది తిన్నాక భోజనం వంటివి చేయకూడదు. ద్రవపదార్థాలు లాంటివి మాత్రమే తీసుకోవాలి. ఇంట్లోనే చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ వంటివి తాగితే మంచిది. కానీ చక్కెర మాత్రం కలుపుకోవద్దు.

అవకాడో బనానా స్మూతీ రెసిపీకి కావలసిన పదార్థాలు

అవకాడో – అర ముక్క

అరటిపండు – ఒకటి

తేనె – రెండు స్పూన్లు

బాదం పాలు – ఒక కప్పు

పిస్తా పప్పుల తరుగు – ఒక స్పూను

అవకాడో బనానా స్మూతీ రెసిపీ

1. అవకాడో అర ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

2. అలాగే అరటిపండును కూడా చిన్న ముక్కలుగా కోయాలి.

3. ఇప్పుడు ఒక బ్లెండర్లో అవకాడో, అరటిపండు, బాదం పాలు, తేనె వేసి గిలక్కొట్టాలి.

4. ఆ స్మూతీని ఒక గ్లాసులో పోయాలి. పైన సన్నగా తరిగిన పిస్తా తో గార్నిష్ చేసుకోవాలి.

5. అంతే స్మూతీ రెడీ అయినట్టే. దాన్ని స్పూన్ తో తినేయాలి. ఇదే మీ ఒక పూట భోజనంగా భావించాలి. ఆ తర్వాత ఆకలిగా అనిపిస్తే వాటర్ మిలన్ జ్యూస్ వంటివి తాగండి. లేదా నిమ్మరసం తాగినా చాలు. ఇలా కొన్ని రోజుల పాటూ చేస్తే త్వరగా బరువు తగ్గుతారు. అల్పాహారంలో ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తినాలి. మధ్యాహ్న భోజనంలో ఈ స్మూతీ వంటివి తీసుకోవాలి. రాత్రికి తేలికపాటి భోజనం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు నెల రోజుల్లోనే కొన్ని కిలోల వరకు బరువు తగ్గుతారు. ఈ స్మూతీ వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. కాబట్టి పోషకాహార లోపం కూడా రాదు.

అవకాడో చాలా తక్కువ మంది తింటూ ఉంటారు. నిజానికి దీన్ని కచ్చితంగా తినాలి. అవకాడో ఎక్కువ ఖరీదు అనుకుంటారు, కానీ అప్పుడప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది. ఒక పండును కొన్నాక దాన్ని రెండు ముక్కలు చేసి రెండు సార్లు స్మూతీలుగా చేసుకొని తాగితే మంచిది.

అవకాడో పండును అప్పుడప్పుడు తినడం వల్ల పేగు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. రక్తనాళాల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువును తగ్గించడంలో ఇది ముందుంటుంది. గర్భంతో ఉన్న స్త్రీలు అవకాడోను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం దీనివల్ల తగ్గుతుంది. అధిక బరువు, ఊబకాయం ఉన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి వారానికి కనీసం రెండు అవకాడోలను తినడం చాలా అవసరం. రెండు అవకాడోలను నాలుగు ముక్కలుగా చేసుకొని నాలుగు రోజులు తినడం వల్ల వారికి అంతా మేలు జరుగుతుంది. వీలైతే రోజుకో అవకాడో పంటను తినడం ముఖ్యం. అధిక రక్తపోటును తగ్గించడంలో ఈ పండు ముందుంటుంది. వేసవిలో ఇలా అవకాడో బనానా స్మూతీ లేదా అవకాడో, వేరే పండు ఏదైనా కలిపి ఇలా స్మూతీలుగా మార్చుకొని తినడం వల్ల మీరు బరువును త్వరగా తగ్గుతారు.