Worlds Oldest Curry: మానవజాతి పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల ఆహారాల విధానాలు మారుతూనే ఉన్నాయి. అయితే ఒక కర్రీని మాత్రం మనం 4000 ఏళ్లుగా తింటూనే ఉన్నాము. అదే గుత్తి వంకాయ కూర. దీన్ని బైంగన్ కూర అంటారు . వంకాయ, అల్లం, పసుపు, ఉల్లిపాయలు అన్నీ దట్టించి చేసే వంకాయ కూరను వేల ఏళ్లుగా మన పూర్వీకులు తింటూనే ఉన్నారు.

ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ను పోస్ట్ చేశారు. దాని ప్రకారం అత్యంత పురాతనమైన కూర బైగన్ కర్రీ అని చెప్పారు. దీన్ని దాదాపు 4000 ఏళ్ల నుండి మనిషి జాతి తింటూనే ఉందని వివరించారు.

ఎలా తెలిసింది?

హర్యానాలోని ఫర్మానా ప్రాంతంలో హరప్పా నాగరికత ఆనవాళ్లు లభించాయి. అక్కడ ఎన్నో తవ్వకాలను చేపట్టారు. అక్కడ ఒక శ్మశాన వాటికలో కొన్ని మట్టి కుండలు కనిపించాయి. ఈ కుండలను ప్రయోగశాలలో పరీక్షించారు. వాటికి అతుక్కుని ఉన్న ఆహార అవశేషాలను విశ్లేషించారు. ఆహార చరిత్రకారులు కనిపెట్టిన దాన్నిబట్టి ఆ కుండల్లో పసుపు, అల్లం, వెల్లుల్లి, వంకాయ అవశేషాలు దొరికాయి. ఇది 4000 ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు. అంటే వంకాయ కూరను అప్పటి నుంచి మనం తింటూనే ఉన్నామని అర్థం.

హరప్పా నాగరికత ఆధునిక గుజరాత్ తో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో అప్పట్లో విస్తరించి ఉంది వారు తమ ఆహారంలో ఉప్పును కూడా వినియోగించారు అలాగే వారు వంకాయ కూరను కూడా వండుకొని తినేవారని ఈ కుండలను పరిశీలించాక తెలిసింది

ఈ బైగన్ కర్రీ గురించి ఇంకా లోతైన పరిశోధన జరగాలని ఆహార చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలిసిన దాని ప్రకారం ప్రపంచంలోనే పురాతనమైన కూరగా ఈ బైగన్ కర్రీని చెప్పుకోవచ్చు. ఈ బైగన్ కర్రీ వండడం చాలా సులువు. ప్రతి ఇంట్లోనూ వంకాయ కర్రీని సులువుగా వండేస్తారు. అప్పట్లో కూడా ఇదే పద్ధతిలో ఉండాలని ఈ కుండల్లోని అవశేషాలు చెబుతున్నాయి.

వంకాయ, ఆవాలు, నూనె, అల్లం, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు… వీటితోనే చక్కగా వంకాయ కూరను వండవచ్చు. చాలామంది తమకు వంకాయ కూర నచ్చదని చెబుతూనే ప్రతిరోజూ తినేసేవాళ్ళు ఉన్నారు. మన దేశంలో ఎక్కువమంది వండుకునే కూరల్లో కూడా వంకాయ కూర ఉత్తమ స్థానంలోనే ఉంది. అది పేదవారికి కూడా అందుబాటు ధరలోనే ఉండడంతో ఎక్కువ మంది ఇళ్లల్లో వంకాయ కూరను వండుకోవడం జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలే చేస్తుంది.

వంకాయ కూరలో కొన్ని బంగాళాదుంపలను కూడా ముక్కలు కోసి వండుకునే వారి సంఖ్య ఎక్కువే. అలాగే వంకాయ టమాట, వంకాయ పప్పు… ఇలా వంకాయతో అనేక రకాల కూరలను జోడిగా వేసి వండుకొని తింటున్నారు. మొత్తం మీద వంకాయల సాగు కూడా నాలుగువేల ఏళ్ల క్రితం నుంచే జరుగుతోందని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.