Yuzvendra Chahal – RR vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ (MI)తో మ్యాచ్‍లో ఓ కీలకమైన మైలురాయిని దాటి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జైపూర్‌ వేదికగా నేడు (ఏప్రిల్ 22) జరుగుతున్న ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‍లో ఓ వికెట్ పడగొట్టిన చాహల్.. ఓ అరుదైన మైల్‍స్టోన్ దాటి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ వివరాలివే..

చరిత్ర సృష్టించిన చాహల్

ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రాజస్థాన్ స్పిన్నర్, భారత స్టార్ యజువేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‍లో 8వ ఓవర్ రెండో బంతికి ముంబై బ్యాటర్ మహమ్మద్ నబీని ఔట్ చేశాడు చాహల్. తన బౌలింగ్‍లో నబీ ఇచ్చిన క్యాచ్‍ను తానే పట్టాడు. ఐపీఎల్‍లో 200వ వికెట్ దక్కించుకున్నాడు చాహల్. దీంతో ఐపీఎల్ హిస్టరీలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ అతడు ఘనత దక్కించుకున్నాడు.

200 వికెట్ల మైలురాయిని చేరాక మైదానంపై మోకాళ్లపై కూర్చొని ఆకాశాన్ని చూస్తూ సంబరాలు చేసుకున్నాడు చాహల్. ఎమోషనల్‍గా సెలెబ్రేట్ చేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్ల జాబితాలో యజువేంద్ర చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చాహల్ తర్వాతి స్థానంలో డ్వైన్ బ్రావో (183 వికెట్లు రిటైర్డ్), పియూష్ చావ్లా (181 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (174 వికెట్లు) ఉన్నారు. ఇప్పటి వరకు 153 ఐపీఎల్ మ్యాచ్‍ల్లోనే 200 వికెట్లను చాహల్ కైవసం చేసుకున్నాడు.

ఆదుకున్న తిలక్, వధేరా.. ఐదు వికెట్లు తీసిన సందీప్

రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (0), రోహిత్ శర్మ (6)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (10) కూడా త్వరగా ఔటవటంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై. తొలి ఓవర్లో రోహిత్ శర్మను రాజస్థాన్ పేసర్ బౌల్ట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో ఇషాన్‍ను సందీప్ శర్మ పెవిలియన్ పంపాడు. సూర్య కూడా నాలుగో ఓవర్లో సందీప్ బౌలింగ్‍లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపు నిలిచిన నబీ (23)ని చాహల్ ఔట్ చేశాడు.

అయితే, ఆ తర్వాత తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ, నేహాల్ వధేరా (24 బంతుల్లో 49 పరుగులు) ఎదురుదాడికి దిగి అద్భుతంగా ఆడారు. ముంబై ఇండియన్స్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‍కు 99 పరుగులు జోడించారు. వదేరాను 17వ ఓవర్లో ఔట్ చేసి సందీప్ బ్రేక్ ఇచ్చాడు. ఇక, 45 బంతుల్లో 65 పరుగులతో తిలక్ అద్భుత అర్ధ శకతం చేశాడు. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో మెప్పించాడు. చివరి ఓవర్లో ఔటయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) మరోసారి విఫలమయ్యాడు. మొత్తంగా ముంబై 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 180 పరుగుల లక్ష్యం నిలిచింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ట్రెండ్ బౌల్ట్ రెండు, ఆవేశ్ ఖాన్, చాహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.