Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్‍లో వివాదం రేగింది. కోల్‍కతా నైట్‍రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరు దుమారాన్ని రేపుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‍లో కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా వేసిన హైఫుల్ టాస్ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు కోహ్లీ. అయితే, ఆ ఫుల్ టాస్ చాలా హైట్‍తో వచ్చిందని నోబాల్ ఇవ్వాలని విరాట్ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ అది నోబాల్ కాదని, కోహ్లీ ఔట్ అని నిర్ణయం ప్రకటించాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లపై విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఫీల్డ్ అంపైర్లతో విరాట్ కోహ్లీ వాదన చేశాడు. అదెలా నోబాల్ కాదని ప్రశ్నించాడు. విరాట్ (18 పరుగులు) ఆ తర్వాత కోపంగా పెవిలియన్‍కు నడుచుకుంటూ వెళ్లాడు. బౌండరీ లైన్ దాటాక కోపంగా బ్యాట్‍తో చెత్త కుండీని కొట్టాడు. 

అంపైరింగ్‍పై కైఫ్ ఫైర్.. కోహ్లీ లైక్

విరాట్ కోహ్లీని ఔట్‍గా ప్రకటించడం సరికాదని, అది నోబాల్ అని భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు పోస్ట్ చేశారు. పూర్ అంపైరింగ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధోనీకి ఇటీవల బ్యాట్ కింద వెళ్లిన బంతిని కూడా వైడ్‍గా ఇచ్చారని కైఫ్ పేర్కొన్నాడు.  “ఆడేందుకు వీలుకాని విధంగా వచ్చిన బీమర్ (ఫుల్ టాస్)కు కోహ్లీ ఔటయ్యాడు. ధోనీ బ్యాట్ కింద వెళ్లిన ఓ బంతిని వైడ్‍గా ఇచ్చారు. కెమెరాలు, రిప్లేలు, టెక్నాలజీలు ఉన్నా ఇంకా పొరపాట్లు జరుగుతున్నాయి. నాసిరకమైన అంపైరింగ్” అని కైఫ్ రాసుకొచ్చారు.

కైఫ్ చేసిన ఈ పోస్టుకు కోహ్లీ లైక్ కొట్టాడు. అది ఔట్ కాదనే తాను ఇంకా ఫీల్ అవుతున్నట్టు దీంతో ఈ ఆర్సీబీ స్టార్ మరోసారి స్పష్టం చేశాడు. అసంతృప్తిని ఈ విధంగా మళ్లీ వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ.