Gavaskar IPL warning: ఐపీఎల్ 2024లో తరచూ భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లోనే మూడుసార్లు 260కిపైగా రన్స్ చేసింది. ప్రతి రెండు, మూడు మ్యాచ్ లలో ఒకదాంట్లో 200కుపైగా స్కోర్లు వస్తూనే ఉన్నాయి. ఇది ఒక స్థాయి వరకూ అభిమానులను అలరించినా.. తర్వాత ఎవరూ చూడరు అంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి అతడు ఓ పరిష్కారం కూడా చూపించాడు.

భారీ స్కోర్లపై గవాస్కర్ రియాక్షన్ ఇదీ

ఐపీఎల్ 2024లో మొత్తంగా 250కిపైగా స్కోర్లు ఐదుసార్లు నమోదయ్యాయి. 2013లో ఐపీఎల్లో అత్యధిక స్కోరుగా నమోదైన 263 పరుగుల రికార్డును ఈ సీజన్లో టీమ్స్ ఏకంగా నాలుగుసార్లు బ్రేక్ చేశాయి. టీ20 క్రికెట్ అంటేనే బాదుడు కదా అని అనుకోవడం సహజమే అయినా.. మరీ ఈ స్థాయి కూడా మంచిది కాదని గవాస్కర్ అంటున్నాడు. బౌండరీల సైజు పెంచాలని అతడు సూచిస్తున్నాడు.

“క్రికెట్ బ్యాట్ కు నేను ఎలాంటి మార్పులు సూచించను. అది నిబంధనలను అనుగుణంగానే ఉంది. కానీ నేను చాలా రోజులుగా చెబుతున్నది ఒకటే.. బౌండరీల సైజు పెంచండి. ఇవాళ గ్రౌండ్ చూడండి. బౌండరీని మరో రెండు మీటర్లు పెంచే వీలుంది. ఇదే ఓ క్యాచ్, సిక్స్ కు మధ్య తేడా. ఎల్ఈడీ లేదా అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులను వెనక్కి జరపండి. దీనివల్ల బౌండరీ రోప్ మరింత వెనక్కి వెళ్లే వీలుంటుంది. లేదంటే బౌలర్లు మరింత ఇబ్బంది పడతారు” అని గవాస్కర్ చెప్పాడు.

ఇప్పుడు భారీగా పరుగులు రావడం బాగానే ఉన్నా.. రానురాను అసలు మజా ఉండదని అతడు స్పష్టం చేశాడు. “టీ20 క్రికెట్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్నది చూస్తుంటే.. నెట్స్ లో కోచ్ చెప్పినట్లు ప్రతి బ్యాటర్ వచ్చీ రాగానే బాదేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఔట్ నాటౌట్ ఏమీ పట్టించుకోవడం లేదు. ఇది కొంత వరకూ ఎంజాయ్ చేస్తుంటాం. కానీ తర్వాత అసలేమాత్రం ఉత్సాహకరంగా ఉండదు. నేను నిజానికి మరింత బలమైన పదం వాడదామనుకున్నా కానీ వద్దు” అని గవాస్కర్ స్పష్టం చేశాడు.

గంభీర్ సూచన ఇదీ..

ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతుండటంపై గతంలో కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. ఐపీఎల్లో వాడుతున్న కూకాబుర్రా బాల్స్ వల్లే ఇలా జరుగుతోందని, వాటి బదులు డ్యూక్స్ వాడండి అని అతడు సూచించడం గమనార్హం. డ్యూక్ బంతి బౌలర్లకు మరింత సహకరిస్తుందని, దీని వల్ల భారీ స్కోర్లు తగ్గుతాయని అతడు అభిప్రాయపడ్డాడు.

ముఖ్యంగా ఐపీఎల్ ఈ సీజన్లో భారీ స్కోర్లు సాధారణమైపోయాయి. గవాస్కర్ చెప్పినట్లు ప్రస్తుతానికి ఫ్యాన్స్ వీటిని ఎంజాయ్ చేస్తున్నా.. బ్యాట్, బాల్ మధ్య సరైన పోటీ లేకపోతే.. భవిష్యత్తులో ఈ ఫార్మాట్ పై ఆసక్తి తగ్గిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఐపీఎల్లో భారీ స్కోర్లపై చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్లే వీటిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి బీసీసీఐ దీనిపై ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.