Friday Motivation: ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా… విలువలను వదులుకోని వ్యక్తిగానే ఉండడం ఇష్టం అని అన్నారు ఒక మహానుభావుడు. అతను ఎవరో కాదు ఎన్నో ఆవిష్కరణలకు మూలకర్త అయిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. తన జీవితంలో ఎన్నో ఓటములను చవి చూశారు ఐన్‌స్టీన్. అయినా కూడా ఎప్పుడూ తప్పుదారుల్లో వెళ్ళలేదు. చెడు పనులు చేసేందుకు ప్రయత్నించలేదు. నిజాయితీగా విలువలతో బతికేందుకే ప్రాధాన్యత ఇచ్చారు.

సాధారణంగా ఎవరైనా గెలుపు మీదనే దృష్టి పెడతారు. గెలిచామా? లేదా? అనేదే వారికి ముఖ్యం. కానీ ఎలా గెలిచామన్నది వారు పట్టించుకోరు. గెలుపు మాత్రమే కాదు… ఆ గెలుపు ఏ పద్ధతిలో వచ్చిందన్నది కూడా మీ విలువను నిర్ణయిస్తుంది. సరైన పద్ధతిలో, సవ్య దిశలో నడిచి గెలిచి చూపించండి. అప్పుడు మీకు విలువ పెరుగుతుంది. అడ్డదారులతో గెలిచినా కూడా ఆ గెలుపుకు విలువ ఉండదు. పేరుకు మీరు విజేత… అయినా అందరి మనసులను గెలవడం మాత్రం చాలా కష్టం. అందుకే ఓటమి ఎదురైనా ఫరవాలేదు, విలువలను మాత్రం ఎక్కడా వదలకండి.

మహాత్మా గాంధీ కూడా ఇదే విషయాన్ని ఎన్నో సార్లు చెప్పారు. సిద్ధి కన్నా సాధనే ముఖ్యం అని అన్నారాయన. అంటే నువ్వు ఏం సాధించావన్నది ముఖ్యం కాదు… ఎలా సాధించావన్నదే ప్రధానం. మీరు ఘోరంగా ఓడిపోయిన ఫరవాలేదు, కానీ అడ్డదారులు మాత్రం తొక్కకండి. అడ్డదారుల్లో సాధించినది ఏదీ ఎక్కువ కాలం నిలవదు.

నిజాయితీగా వెళ్తే సమస్యలు వస్తాయి కదా అనిపించవచ్చు. సమస్య లేని జీవి ఉండదు. ఎన్ని సమస్యలు ఎదురైనా విలువలను వదలకుండా సాగడమే నిజమైన విజయం. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదురొడ్డి పోరాడి గెలిచి చూడండి. మీ జీవితం మీకే గొప్పగా అనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారికి మీరు అసలు సిసలైన పోరాటయోధుడిలా కనిపిస్తారు.

కష్టమైనా, సుఖమైనా, సంతోషమైనా, బాధైనా… అన్నీ మీరు చూసే కోణంలోనే ఉంటుంది. ఇతరులలో మీరు ఎప్పుడూ మంచినే చూస్తుంటే… మీకు మంచే కనపడుతుంది. అదే చెడు వెతికితే అంత చెడే ఎదురవుతుంది.

విజయం అంత సులువుగా రాదు. కఠోర పరిశ్రమ అనంతరం భరించే విజయం చాలా గొప్పగా ఉంటుంది. ఒక్కసారి విఫలం అవ్వగానే నిరాశ చెందకండి. ఆ వైఫల్యాన్ని ప్రేరణగా మార్చుకోండి. విజయానికి పునాది వేసుకోండి. అడ్డదారుల్లో సాధించిన విజయాన్ని త్వరగా జనాలు మరిచిపోతారు. అదే కఠోర శ్రమతో సాధించే విజయం చరిత్రలో పేజీలుగా మారిపోతుంది. మీకు ఎలాంటి విజయం కావాలో మీరే నిర్ణయించుకోండి.