Mixed Vegetable Salad: సలాడ్ అంటేనే అన్నీ ఆరోగ్యకరమైన ఆహారాల కలయిక. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడతారు. దీన్ని పెద్దగా వండాల్సిన అవసరం ఉండదు. పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ సలాడ్లు తినడం వల్ల బరువు కూడా సులువుగా తగ్గుతారు. ఈ సలాడ్ లో మనం ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను కలిపాము. ఇందులో వాడిన కూరగాయలన్నీ చర్మానికి కాంతిని అందిస్తాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ సలాడ్ పూర్తి ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ సలాడ్‌ని తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఎలా చేయాలో తెలుసుకోండి.

మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బీన్స్ తరుగు – మూడు స్పూన్లు

క్యాబేజీ తరుగు – మూడు స్పూన్లు

క్యారెట్ తరుగు – మూడు స్పూన్లు

బ్రకోలి – 100 గ్రాములు

క్యాప్సికం తరుగు – మూడు స్పూన్లు

టమోటో తరుగు – మూడు స్పూన్లు

పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను

నిమ్మరసం – ఒక స్పూను

కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు

మిరియాల పొడి – పావు స్పూను

మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ రెసిపీ

1. ముందుగానే అన్ని కూరగాయలను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఒక పక్కన పెట్టుకోవాలి.

2. స్టీమర్లో వీటన్నింటినీ వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.

3. స్టీమర్ లేకపోతే ఒక గిన్నెలో ఈ కూరగాయలన్నీ వేసి ఒక అర గ్లాసు నీళ్లు వేసి ఉడికిస్తే చాలు.

4. కూరగాయలు కాస్తా మెత్తగా అవుతాయి.

5. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ కూరగాయలపై నిమ్మ రసాన్ని చల్లుకోవాలి.

6. పైన మిరియాల పొడిని చల్లుకొని, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.

7. అంతే మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ రెడీ అయినట్టే.

8. దీన్ని తరచూ తినడం వల్ల ఆరోగ్యంలో ఎన్నో మంచి మార్పులు వస్తాయి.

9. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా మారుతుంది.

10. కళ్ళు కాంతివంతంగా కనిపిస్తాయి. బరువు కూడా త్వరగా తగ్గుతారు.

11. ఇక కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ సలాడ్ ను తరచూ తింటూ ఉంటే మీ శరీరంలో వచ్చే మార్పులు మీకే తెలుస్తాయి.

ఈ మిక్స్‌డ్ వెజిటబుల్స్ సలాడ్‌లో ఉన్న క్యారెట్, క్యాబేజీ, బ్రకోలీ, క్యాప్సికం, టమోటో, గ్రీన్ బీన్స్ అన్నీ మన శరీరానికి కావలసిన పోషకాలు కలిగి ఉన్నవి. వీటిని ఉడికించి తినడం వల్ల శరీరం త్వరగా పోషకాలను గ్రహిస్తుంది. నూనె వాడకుండా ఈ సలాడ్ ను తయారు చేశాం. కాబట్టి ఇది ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇందులో ఉండే క్యారెట్లు, గ్రీన్ బీన్స్, క్యాబేజీ, బ్రొకోలీ ఇవన్నీ కూడా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపిస్తాయి. ఒక్కసారి ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ సలాడ్‌ను తిని చూడండి. మీకు రుచిగా అనిపిస్తుంది.