EVM-VVPAT verification : ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్లతో.. 100శాతం వీవీప్యాట్ల స్లిప్స్​ని సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అదే సమయంలో.. ఈవీఎం వ్యవస్థను తొలగించి, మళ్లీ పేపర్​ బ్యాలెట్​ ప్రక్రియను అమలు చేయాలన్న పిటిషన్లను సైతం తోసిపుచ్చింది జస్టిస్​ ఖన్నా, జస్టిస్​ దత్తతో కూడిన ధర్మాసనం.

ప్రస్తుతం.. ఈవీఎంలు– వీవీప్యాట్ల సిప్స్​కి సంబంధించి.. ప్రతి అసెంబ్లీ, లోక్​సభ నియోజకవర్గాల్లో 5 ఈవీఎంలను మాత్రమే సరిపోల్చి చూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇదే కొనసాగనుంది.

‘వ్యవస్థను గుడ్డిగా అనుమానించకూడదు..’

“ఈవీఎం- వీవీప్యాట్​ కేసు విషయంలో వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సరైన విషయం కాదు. అర్థవంతమైన విమర్శలు చేయడంలో తప్పు లేదు. అది న్యాయవ్యవస్థపైనైనా లేక శాసన వ్యవస్థపైనైనా సరే! ప్రజాస్వామ్యం అంటే సామరస్యాన్ని మెయిన్​టైన్​ చేసుకోవడమే. అది నమ్మకం, సహకారం వల్లే జరుగుతుంది. అలా చేస్తేనే ప్రజాస్వామ్యాన్ని బలపరచవచ్చు,” అని జస్టిస్​ దత్త తన తీర్పులో వెలువరించారు. అన్ని అధారాలను చూసిన తర్వాతే.. తమ తీర్పును చెబుతున్నట్టు స్పష్టం చేశారు.

అదే సమయంలో.. ఎలక్షన్​ కమిషనర్​కి రెండు ఆదేశాలను జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈవీఎంలో చిహ్నాలను పెట్టినప్పుడు, సింబల్​ లోడింగ్​ యూనిట్​ని సీల్​ చేసి, భద్రంగా కంటైనర్స్​లో పెట్టాలని చెప్పింది. సీల్​ మీద అభ్యర్థులు సంతకాలు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయం నుంచి కనీసం 45 రోజుల పాటు.. ఈ సీల్​ చేసిన ఎస్​ఎల్​యూలను ఈవీఎంలతో స్టోర్​రూమ్​లో పెట్టాలని వెల్లడించింది.

ఎన్నికల ప్రక్రియ ముగిసన తర్వాత.. ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంట్​ నియోజకవర్గంలోని కనీసం 5శాతం కంట్రోల్​ యూనిట్​లు, బాలెట్​ యూనిట్​లు, వీవీప్యాట్​లను.. ఈవీఎం తయారీ సంస్థలకు చెందిన ఇంజినీర్లు చెక్​ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది.. ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల అభ్యర్థనతో జరుగుతుందని, ఫలితాలు వెలువడిన 7 రోజులలోపు.. రిక్వెస్ట్​ చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలా అభ్యర్థన చేసుకున్న వారే.. ఖర్చులు భరించాలని, ఒకవేళ ఈవీఎంలు టాంపరింగ్​కు గురైనట్టు తేలితే.. ఖర్చులు వెనక్కి తిరిగిచ్చేయాలని తెలిపింది.

EVM-VVPAT verification supreme court : ఈవీఎంలు- వీవీప్యాట్ల వ్యవహారంపై గత కొంతకాలంగా విచారణ జరుపుతోంది సుప్రీంకోర్టు. తాము ఎన్నికల సంఘాల కార్యకలాపాలను నిర్దేశించలేమని, కేవలం అనుమానాలు ఉన్నాయని.. రూల్స్​ని మార్చలేమని సుప్రీంకోర్టు కొన్ని రోజుల ముందు అభిప్రాయపడింది.

Supreme court latest news : ఈవీఎంలలో కంట్రోల్​ యూనిట్​, బాలటింగ్​ యూనిట్​లు ఉంటాయి. వీటిని కేబుల్​ సాయంతో కనెక్ట్​ చేస్తారు. ఇవి వీవీప్యాట్​లకు కూడా కనెక్ట్​ అయ్యుంటాయి. ఈ వీవీప్యాట్​ అంటే.. ఓటర్​ వెరిఫైడ్​ పేపర్​ ఆడిట్​ ట్రైల్​. ఈవీఎంలో బటన్​ ప్రెస్​ చేసిన తర్వాత.. ఓటు పడిందా? లేదా? అనేది ఓటరుకు తెలియజేసే యంత్రం వీవీప్యాట్​. ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వాశామో కూడా కనిపిస్తుంది.