రెగ్యులర్ హెల్త్ చెకప్ లు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఏదైనా సమస్య ప్రాణం మీదకు వచ్చాకే తెలుసుకుంటారు.  స్వీయ-ఆరోగ్య సంరక్షణ ప్రతి మహిళకు అవసరం. కుటుంబం గురించే కాదు, తమ గురించి తాము కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. భారతీయ మహిళల్లో అత్యంత ముఖ్యమైన స్క్రీనింగ్ పరీక్ష గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్  కోసం చేసే పాప్ స్మియర్ పరీక్ష.  21 ఏళ్ల నుంచి  65 సంవత్సరాల వయస్సు గల మహిళలు ప్రతి మూడేళ్లకోసారి ఈ పరీక్షను చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎంత మంది మహిళల ప్రాణాలను కాపాడిన అత్యంత విలువైన పరీక్ష ఇది. మహిళలు ఏటా కొన్ని పరీక్షలను కచ్చితంగా చేయించుకోవాలి. 

  1. రొమ్ము పరీక్షలు: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య అధికంగా ఉంది.  రొమ్ము కణజాలంలో ఏదైనా అసాధారణ మార్పులు లేదా గట్టిగా ఉండే ముద్దలను కనుగొంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.  40 ఏళ్లు పైబడిన మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. .
  2. సర్వైకల్ క్యాన్సర్ : భారతీయ మహిళలకు అధికంగా సోకుతున్న మరో క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.  21 సంవత్సరాలు దాటిన తరువాత ఏటా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. పాప్ స్మియర్ అనేది గర్భాశయ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ప్రక్రియ. ఇది గర్భాశయంలో క్యాన్సర్ కణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. 
  3. పొత్తికడుపు, కటి భాగం సోనోగ్రఫీ: అండాశయ క్యాన్సర్లను ముందుగానే నిర్ధారించడానికి ఏటా పొత్తికడుపు,  కటి భాగం సోనోగ్రఫీ చేయించుకోవాలి. అండాశయ క్యాన్సర్ ఉన్న మీ కుటుంబంలో ఎవరికైనా ఉంటే అది మీకు ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. ఏటా పరీక్షలు చేయించుకుంటే ఏ క్యాన్సర్ అయినా ముందస్తు దశలోనే బయటపడుతుంది. 
  4. గర్భాశయ ఆరోగ్యం:  అసాధారణ రక్తస్రావం, ఫైబ్రాయిడ్లు, పాలిప్స్ వంటివి అనేక గర్భాశయ వ్యాధుల లక్షణాలు. మీకు ఇలా లక్షణాలు కనిపిస్తే ఆలస్య చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. 
  5. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్): పిసిఒఎస్ అనేది ఎక్కువ శాతం మంది మహిళలను ప్రభావితం చేసే ఒక సాధారణ జీవనశైలి రుగ్మత. పిసిఒఎస్ లక్షణాలను తగ్గించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సమతుల్య ఆహారంతో సహా ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
  6. మెనోపాజ్ తర్వాత రక్తస్రావం: మెనోపాజ్ తర్వాత  రక్తస్రావం జరగడం సాధారణం కాదు. వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. రుతువిరతి తర్వాత రక్తస్రావం ఎండోమెట్రియల్ క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం.
  7. ఎముక సాంద్రత స్క్రీనింగ్: మహిళలకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఆర్ధరైటిస్ రావచ్చు. ఎముక సాంద్రత పరీక్షలు 65 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏటా చేయించుకోవాలి. 
  8. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్: మహిళలు థైరాయిడ్ రుగ్మతలకు ఎక్కువగా గురవుతారు. రెగ్యులర్ TSH (థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్) పరీక్షలు అసాధారణతలను ముందుగా గుర్తించడంలో సహాయపడతాయి.