Weekend OTT releases: వీకెండ్ వచ్చేస్తోంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ఓటీటీలు కూడా రెడీ అయిపోయాయి. ఈ వారం మొదట్లో కంటే మధ్యలో రెండు సర్‌ప్రైజ్ సినిమాలు ఈ రిలీజ్‌ల జాబితాలో వచ్చి చేరాయి. ఈ కొత్త సినిమాలను మీరు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహాలాంటి ఓటీటీల్లో చూడొచ్చు. మరి ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం.

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

ఫ్యామిలీ స్టార్ – ప్రైమ్ వీడియో

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ఊహించిన దాని కంటే వారం ముందుగానే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచి మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని బుధవారమే (ఏప్రిల్ 24) సదరు ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది.

భీమా – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

గోపీచంద్ నటించిన భీమా మూవీ మొత్తానికి నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం (ఏప్రిల్ 25) నుంచే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ యాక్షన్ డ్రాను వీకెండ్ లో చూడటానికి ప్లాన్ చేసుకోండి. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే సక్సెస్ సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

టిల్లూ స్క్వేర్ – నెట్‌ఫ్లిక్స్

ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ గా నిలిచిన మూవీ టిల్లూ స్క్వేర్. సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచి టిల్లూ స్క్వేర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 29న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయినా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుండటం విశేషం.

నాయట్టు (తెలుగు) – ఆహా ఓటీటీ

మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఆహా ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఇప్పటికే తెలుగులో కోటబొమ్మాళి పీఎస్ పేరుతో ఈ సినిమా రీమేక్ అయిన విషయం తెలిసిందే.

రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్ – జియో సినిమా

రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్ ఓ హిందీ వెబ్ సిరీస్. పుల్వామా దాడి, తర్వాత పీఓకేలో ఇండియా చేసిన దాడి ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్.. శుక్రవారం (ఏప్రిల్ 26)నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. జిమ్మి షెర్గిల్, లారా దత్తా నటించారు.

దిల్ దోస్తీ డైలమా – ప్రైమ్ వీడియో

దిల్ దోస్తీ డైలమా కూడా ఓ హిందీ వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియోలో గురువారం (ఏప్రిల్ 25) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది.