OMG 2 Telugu OTT: అక్ష‌య్‌కుమార్ బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓ మై గాడ్ 2 తెలుగులోకి వ‌చ్చింది. ఈ బాలీవుడ్ మూవీ తెలుగు వెర్ష‌న్ గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఇన్నాళ్లు మై గాడ్ 2 హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ వ‌చ్చింది. తాజాగా ద‌క్షిణాది భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. ఓ మై గాడ్ హిందీ వెర్ష‌న్ గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. తెలుగు వెర్ష‌న్‌ను మాత్రం తొమ్మిది నెల‌ల త‌ర్వాత రిలీజ్ చేశారు.

టాప్ టెన్ మూవీస్‌లో ఒక‌టిగా…

2023 ఆగ‌స్ట్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రెండు వంద‌ల ఇర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో డీలా ప‌డ్డ అక్ష‌య్ కెరీర్‌కు ఓ మై గాడ్ 2 విజ‌యం ఊర‌ట‌ నిచ్చింది. గ‌త ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ మూవీస్‌లో ఒక‌టిగా ఓ మై గాడ్ నిలిచింది.

ఓ మై గాడ్‌కు సీక్వెల్‌…

ఓ మై గాడ్‌లో అక్ష‌య్‌కుమార్‌తో పాటు పంక‌జ్ త్రిపాఠి, యామి గౌత‌మ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీకి అమిత్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అక్ష‌య్ కుమార్ హీరోగా 2012లో రిలీజైన ఓ మై గాడ్ మూవీకి సీక్వెల్‌గా ఓ మై గాడ్ 2 తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ శివుడి పాత్ర‌లో క‌నిపించారు.

సెన్సార్ నుంచి ఏ స‌ర్టిఫికెట్‌…

ఓ మై గాడ్ 2లో అక్ష‌య్ కుమార్ శివుడి పాత్ర‌లో క‌నిపించ‌డంపై కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ఓ వ‌ర్గం మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఈ మూవీ క‌థ, క‌థ‌నాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. దాంతో ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ పేరును శివుడి అని కాకుండా దేవ‌దూత‌గా మేక‌ర్స్ మార్చేశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అంతే కాకుండా సినిమాలోని 20 సీన్ల‌ను సెన్సార్ బోర్డ్ క‌ట్ చేసింది. సెన్సార్ తీరుపై మూవీ మేక‌ర్స్ ఫైర్ అయ్యారు. కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు ఈ మూవీ సెన్సార్‌పై రివిజ‌న్ క‌మిటీని ఆశ్ర‌యించింది. రివిజ‌న్ క‌మిటీ సినిమాలో 25 మార్పులు సూచించింది. కానీ ఏ స‌ర్టిఫికెట్‌ను మాత్రం తొల‌గించ‌లేదు. అనేక వివాదాల‌తో, అడ్డంకులు, వాయిదాల‌ను దాటుకొని థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్టైంది.

బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌…

గ‌త కొన్నేళ్లుగా అక్ష‌య్ బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. 2020 నుంచి 2024 వ‌ర‌కు నాలుగేళ్ల‌లో అక్ష‌య్ కుమార్ 14 సినిమాలు చేయ‌గా…అందులో ప‌న్నెండు సినిమాలు ఫ్లాప‌య్యాయి. అత‌డి లేటెస్ట్ మూవీ భ‌డే మియా చోటే మియా కూడా నిర్మాత‌ల‌కు వంద కోట్ల‌కుపైనే న‌ష్టాల‌ను మిగిల్చింది. భ‌డే మియా చోటే మియాలో టైగ‌ర్ ష్రాఫ్ మ‌రో హీరోగా న‌టించాడు. మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా క‌నిపించాడు.

ప‌ది సినిమాలు సెట్స్‌…

ఈ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ప్ర‌స్తుతం ప‌ది సినిమాల్లో న‌టిస్తూ అక్ష‌య్ కుమార్ బిజీగా ఉన్నాడు. సింగం అగైన్‌, స్కై ఫోర్స్‌, వెల్‌క‌మ్ టూ ది జంగిల్‌, శంక‌ర‌, ఖేల్ ఖేల్ మే తో ప‌టు మ‌రో ఐదు సినిమాల్లో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నాడు. ఈ ఏడాది వీటిలో నాలుగైదు సినిమాలు రిలీజ్ కానున్నాయి.