posted on Apr 24, 2024 1:02PM

తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయా? తండ్రీ కొడుకుల మధ్యే గ్యాప్ వచ్చిందా?   ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు రెండేళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. అసలు బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) రెండో సారి గెలిచిన తరువాత నుంచే తండ్రీ కొడుకుల మధ్య కనిపించని గ్యాప్ ఏర్పడిందని అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి.  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే తాను జాతీయ రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించడానికి కేటీఆర్ ను తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చో పెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసమే కేటీఆర్ ను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడమన్నది మాత్రం జరగలేదు. ఇందుకు చాలా చాలా కారణాలున్నాయి. పార్టీలో కేటీఆర్ కు పూర్తి ఆమోదం లేకపోవడం, తిరుగుబాటు వస్తుందన్న బెదురు, అన్నిటికీ మించి కుటుంబంలోనే అందుకు వ్యతిరేకత వచ్చిందన్న వార్తలు వీటిలో కారణమేదైతేనేం ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ కు పట్టాభిషేకం అయితే జరగలేదు.

ఈ విషయంలో అప్పట్లోనే కేటీఆర్ తండ్రితో విభేదించారనీ, కొంత కాలం పాటు ముభావంగా కూడా ఉన్నారనీ అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. మొత్తానికి ఏమైతేనేం కేటీఆర్ మాత్రం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగానే ఉండిపోయారు. సీఎం పీఠం అయితే దక్కలేదు. ముచ్చటగా మూడో సారి గెలిచి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకే అడ్డంకులూ లేకుండా కుమారుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేసి జాతీయ రాజకీయాలలోకి దూకేద్దామన్న కేసీఆర్ ఎత్తుగడ గత ఎడిది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఘోరంగా దెబ్బతింది. 

అదిగో ఆ క్షణం నుంచీ కేటీఆర్ పార్టీ పేరు మార్పు కారణంగానే ఓటమి ఎదురైందంటూ.. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలంటూ చెబుతున్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదు ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరు మార్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని కూడా సెలవిచ్చారు. 

అయితే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఉద్దేశమే అధినేత కేసీఆర్ కు లేదని ఆయన తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేలిపోయింది. బీఆర్ఎస్ పేరుకు ఏమోచ్చింది? పేరు మార్చే అవసరమే లేదని ఆయన తెగేసి చెప్పారు.  ఒక వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెబుతుంటే… కేసీఆర్ మాత్రం పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని చెప్పడంతో తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమౌతున్నాయి.