DC vs GT: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ పుంజుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను మరింత పెంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది.

పంత్ అదుర్స్

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు సాధించింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులతో మెరుపులు మెరిపించాడు. చివరి వరకు నిలిచి అజేయ అర్ధశకతం చేశాడు. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో పంత్ అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66 పరుగులు; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో దుమ్మురేపగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (7 బంతుల్లో 26 పరుగులు నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ బ్యాటింగ్ చేశాడు. 44 పరుగులకే 3 వికెట్ల కోల్పోయిన దశలో నాలుగో వికెట్‍కు 113 పరుగుల భాగస్వామ్యంతో పంత్, అక్షర్ ఢిల్లీని అద్భుతంగా నిలబెట్టారు. ఆరంభంలో జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (13 బంతుల్లో 23 పరుగులు) వేగంగా ఆడాడు. చివరి ఓవర్లో రిషబ్ పంత్ నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టాడు. దీంతో మోహిత్ శర్మ వేసిన ఆ ఓవర్లో 31 రన్స్ వచ్చాయి. మొత్తంగా చివరి రెండు ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 53 పరుగులు దక్కాయి.

గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ మూడు వికెట్లు దక్కించుకోగా.. నూర్ అహ్మద్‍కు ఓ వికెట్ దక్కింది. అయితే, సీనియర్ పేసర్ మోహిత్ శర్మ ఏకంగా నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 73 పరుగులు సమర్పించేశాడు. ఐపీఎల్‍లో ఒకే మ్యాచ్‍లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డును మూటగట్టుకున్నాడు.

మిల్లర్, రషీద్ భయపెట్టినా..

లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసింది గుజరాత్. చివరి వరకు పోరాడి 4 రన్స్ తేడాతో ఓడింది. ఛేజింగ్‍లో గుజరాత్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (6) విఫలమయ్యాడు. వృద్ధిమాన్ సాహా (39) కాసేపు నిలిచినా.. వేగంగా ఆడలేకపోయాడు. అయితే, యంగ్ బ్యాటర్ సాయిసుదర్శన్ అర్ధ శతకంతో అదరగొట్టడంతో ఆటలో నిలిచింది గుజరాత్. 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు సుదర్శన్. అయితే, ఒమర్‌జాయ్ (1), షారుఖ్ ఖాన్ (8), రాహుల్ తెవాతియా (4) ఔటవటంతో గుజరాత్ సులువుగానే ఓడిపోతుందనిపించింది. చివరి ఐదు ఓవర్లలో 78 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే, డేవిడ్ మిల్లర్ మాత్రం మరోవైపు తీవ్రంగా పోరాడాడు. 23 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. భీకర హిట్టింగ్‍తో ఢిల్లీ క్యాంప్‍లో టెన్షన్ పెంచాడు కిల్లర్ మిల్లర్. అయితే, 18వ ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ అతడిని ఔట్ చేశాడు.

అయితే, రషీద్ ఖాన్ 11 బంతుల్లో 21 పరుగులు (నాటౌట్) చేసి చివరి వరకు పోరాడాడు. సాయి కిశోర్ (13) 19 ఓవర్లో కీలకమైన రెండు సిక్స్‌లు కొట్టి ఔటయ్యాడు. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి రాగా.. ముకేశ్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్లు కొట్టాడు రషీద్. ఆ తర్వాత రెండు డాట్స్ పడ్డాయి. ఐదో బంతికి సిక్స్ కొట్టి మళ్లీ ఉత్కంఠ రేపాడు రషీద్. అయితే, చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. బౌండరీ కొట్టలేకపోయాడు. దీంతో ఢిల్లీ గెలిచింది.

ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలామ్ మూడు వికెట్లతో రాణించగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఎన్రిచ్ నోర్జే, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఆరో ప్లేస్‍కు ఢిల్లీ

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచిన ఢిల్లీ 8 పాయింట్లను కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి ఎకబాకింది. 9 మ్యాచ్‍ల్లో ఐదు పరాజయాలతో గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉంది.