posted on Apr 24, 2024 5:04PM

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు. బుధవారం నాడు తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో వున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, మహిళల హారతులు అందుకుని, కార్యకర్తల బాణాసంచా హడావిడి మధ్య కేసీఆర్ బస్సు ఎక్కారు. బుధవారం నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర జరుగుతుంది. మిర్యాలగూడలో మొదటి సభ, సిద్దిపేటలో చివరి సభ జరుగుతాయి. రాష్ట్రమంతా తిరగాలని కేసీఆర్‌కి విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ సమయం తక్కువగా వుండటం, ఎండ బాగా వుండటం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే తిరగాలని కేసీఆర్ భావించారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్ చేపట్టిన ఈ బస్సు యాత్రను.. బస్సు యాత్ర అనడం కంటే ‘బస్సు యాతన’ అనడం బెస్టు. ఎందుకంటే, పార్లమెంట్ ఎన్నికలలో తమ పార్టీ పదికి పైగానే స్థానాలు గెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు బిల్డప్పుగా చెబుతున్నప్పటికీ, ఒక్క మెదక్ స్థానంలో తప్ప ఎక్కడా గెలిచే అవకాశాలు లేవని ఏరకంగా చూసిన క్రిస్టల్  క్లియర్‌గా అర్థమవుతోంది. మెదక్ విషయంలో రేవంత్ రెడ్డి ఏదైనా మ్యాజిక్ చేస్తే  ఆ స్థానం కూడా బీఆర్ఎస్‌కి దక్కనట్టే. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఈ వయసులో పదిహేను రోజులపాటు బస్సు యాత్ర చేసి యాతన పడటం అవసరమా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ ఇప్పుడు చేపట్టిన బస్సు యాత్ర అయిపోయిన పెళ్ళికి సన్నాయి ఊదినట్టుగా వుందని భావిస్తున్నారు.