Tiranga Burfi: హిందువులకు పరమ పుణ్యక్షేత్రం కాశీ. కాశీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి ప్రత్యేకతల్లో ఇప్పుడు తిరంగా బర్ఫీ కూడా చేరిపోయింది. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ బర్ఫీది కూడా ముఖ్య పాత్ర. తాజాగా ఈ తిరంగా బర్ఫీకి కొత్త గుర్తింపు వచ్చింది. ఈ తిరంగా బర్ఫీకి జిఐ ట్యాగ్ అందించారు. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అర్థం. ఈ ట్యాగ్ అందుకున్న ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అమ్మకాలు పెరుగుతాయి. ధరలు పెరుగుతాయి.

తిరంగా బర్ఫీ చరిత్ర

కాశీలో ఉన్నవారికి తిరంగా బర్ఫీ చరిత్ర చాలా మేరకు తెలిసే ఉంటుంది. స్వాతంత్య్రానికి ముందు 1940ల కాలంలో వారణాసిలో పరిస్థితులు వేరుగా ఉండేవి. స్వాతంత్య్రం కోసం ప్రతి భారతీయుడు ఆవేశంతో రగిలిపోతూ ఉండేవారు. అలాంటి వ్యక్తుల్లో ఒక స్వీట్ షాపు డైరెక్టర్ మదన్ గోపాల్ గుప్తా కూడా ఒకరు. ఆయన రామ్ భండార్ అనే షాపు పేరుతో స్వీట్లు తయారుచేసి అమ్మేవారు. ఆయన తయారు చేసిన ప్రత్యేక బర్ఫీ ఈ తిరంగా బర్ఫీ. ఇది మన జాతీయ జెండాలోని మూడు రంగుల కలయికతో ఉంటుంది. బ్రిటిష్ వారు పాలించే కాలంలో మన త్రివర్ణ పతాకం పై నిషేధం ఉండేది. భారతీయుల్లో స్వాతంత్రోద్యమకాంక్షను పెంచడానికి మదన్ గోపాల్ గుప్త తిరంగా బర్ఫీ పేరుతో జాతీయ జెండాలోని రంగులతో స్వీట్లను తయారు చేసి ప్రజల్లో ఉచితంగా పంపిణీ చేసేవారు. బ్రిటిష్ వారు ఈ బర్ఫీని చూసి ఆశ్చర్యపోయేవారు. అలా ఈ తిరంగా బర్ఫీ స్వాతంత్య్ర ఉద్యమంలో తన పాత్రను పోషించింది. ఇప్పటికీ ఈ బర్ఫీ గురించి ఎన్నో కథలుగా చెప్పకుంటారు అక్కడి ప్రజలు.

తిరంగా బర్ఫీని కాశీలో ఇప్పుడు ఎంతమంది తయారు చేస్తున్నా… రామ్ భండార్లో విక్రయించే తిరంగా బర్ఫీకి తిరుగు లేదని అంటారు. 1940లో ఎలాంటి రుచిని అందించారో ఇప్పటికీ అదే రుచితో ఆ బర్ఫీని తయారు చేస్తున్నట్టు ప్రజలు చెబుతారు. దీనిలో కుంకుమపువ్వు, పిస్తా, కోవా, జీడిపప్పులు ఉపయోగించి తయారు చేస్తారు. దీని ఖరీదు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కుంకుమ పువ్వును బర్ఫీలో నారింజ రంగు కోసం, పిస్తా పప్పును ఆకుపచ్చ రంగు కోసం, తెలుపు భాగం కోసం కోవాను, జీడిపప్పును వినియోగిస్తారు.