Artificial Sweetener: పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక మరణించింది. సరిగ్గా తన పుట్టినరోజున ఆమె తాను కట్ చేసిన కేకును తిని ప్రాణాలు విడిచింది. ఆమె పుట్టిన రోజు కోసం బేకరీ నుండి చాక్లెట్ కేక్‌ను ఆర్డర్ చేశారు. ఆ కేకును తిన్న బాలికతో పాటు కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురైంది. బాలిక మాత్రమే ప్రాణాలు కోల్పోయింది.

ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడం కోసం కేకు నమూనాను పోలీసులు ల్యాబ్ కు పంపించారు. ఆ కేకులో అధిక మొత్తంలో తీపి రుచిని అందించే సాచరైన్ అనే సమ్మేళనం ఉన్నట్టు గుర్తించారు. తినుబండారాలకు, పానీయాలకు తీపి రుచిని అందించేందుకు ఈ సాచరైన్ అనే సమ్మేళనాన్ని వినియోగిస్తారు. దీన్ని చాలా తక్కువ మొత్తంలో వినియోగించాలి. కానీ ఈ కేకులో అధిక మొత్తంలో వినియోగించారు. దీనివల్లే ఆ బాలిక కుటుంబం అనారోగ్యం బారిన పడింది. అందరిలో చిన్న పిల్ల అయినా బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేకును తయారు చేసిన బేకరీ వారిని అరెస్టు చేశారు పోలీసులు.

మనం కొనే కేకుల్లో ఎంత సాచరైన్ కలిపారో తెలుసుకోవడం కష్టం… కాబట్టి పిల్లలకు కేకులను కొనడం తగ్గించి ఇంటి ఆహారానికి అలవాటు చేయడం అన్ని విధాలా మంచిది.

ఏంటీ సాచరైన్?

సాచరైన్ అనేది సింథటిక్ స్వీట్‌నర్. దీన్ని 1879లో ఒక రసాయన శాస్త్రవేత్త కనిపెట్టారు. ఇది పంచదార కంటే 300 నుండి 400 రెట్లు తియ్యగా ఉంటుంది. కానీ ఎలాంటి కేలరీలను కలిగి ఉండదు. తీపిదనం కోసం దీన్ని వాడుతూ ఉంటారు. 20 శతాబ్దం ప్రారంభంలో పంచదార కొరత ఏర్పడింది. ఆ సమయంలో సాచరైన్ ఉపయోగించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా డైట్ సోడాలు, స్వీట్‌నర్ తక్కువ క్యాలరీల ఉత్పత్తుల్లో దీన్ని వాడడం ప్రారంభించారు. అయితే చాలా తక్కువ మొత్తంలోనే దీన్ని వాడేవారు. ఎక్కువ మొత్తంలో వేస్తే అది శరీరంపై హానికరమైన ప్రభావాలను చూపిస్తుంది.

సాచరైన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే సాచరైన్ ఉండే ఆహారాలు అధికంగా తినడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. ఇది జీర్ణ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే జీర్ణశయాంతర అసౌకర్యం కలిగి విపరీతమైన విరోచనాలు జరగవచ్చు. కాబట్టి సాచరైన్ వాడే డైట్ సోడాలు, కూల్ డ్రింకులు, కేకులు వంటి వాటిని దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. దీన్ని అధిక మొత్తంలో వాడితే చిన్నపిల్లల శరీరంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.