BHA shoe size system:త్వరలో భారతీయుల కోసం ప్రత్యేకమైన పాదరక్షల సైజింగ్ విధానం అందుబాటులోకి రానుంది. భారత్ లోని వివిధ వయస్సుల వ్యక్తులకు మరింత సౌకర్యవంతమైన పాదరక్షలను రూపొందించడానికి వ్యక్తుల పాదం పొడవును మాత్రమే కాకుండా వెడల్పును కూడా పరిగణనలోకి తీసుకుని ఈ విధానాన్ని (BHA shoe size system) రూపొందించారు.

ఇండియన్ ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్

డిసెంబర్ 2021 లో, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) తో కలిసి భారతీయుల అవసరాలను ప్రత్యేకంగా తీర్చే ‘ఇండియన్ ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్’ ను అభివృద్ధి చేసింది. ఇటీవల ఈ వ్యవస్థ సమర్థతను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి ఆమోదం కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కు నివేదిక సమర్పించారు.

‘బీహెచ్ఏ.. భా’ ఫుట్ వేర్ సైజింగ్

భారత పాదరక్షల తయారీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. భారత పాదరక్షల సైజింగ్ విధానానికి.. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా ‘బీహెచ్ఏ.. భా’ (Bha’ – भ) అనే పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2025 నాటికి ప్రస్తుతమున్న యూకే/యూరోపియన్, యూఎస్ సైజింగ్ వ్యవస్థలను ’భా ((Bha’ – भ))’ భర్తీ చేయనుంది.

యూజర్ ట్రయల్స్ తరువాత..

‘‘ఈ భా (Bha’ – भ) పాదరక్షల సైజింగ్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చే ముందు.. దాదాపు ఏడాది పాటు యూజర్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇందులో 5-55 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 10,000 మంది పాల్గొంటారు. ఈ ట్రయల్స్ ఫలితాలను నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ తరువాత 2025 నాటికి భారతీయ పాదరక్షల సైజింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’’ అని సీఎల్ఆర్ఐ డైరెక్టర్ కేజే శ్రీరామ్ అన్నారు.

ఇతర దేశాలు ఫాలో అవుతాయా?

ఇతర దేశాలు భారతీయ షూ సైజింగ్ వ్యవస్థను అవలంబిస్తాయా అన్న ప్రశ్నకు సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి సమాధానమిచ్చారు. ‘‘భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటి కాబట్టి, భారతీయ సైజింగ్ వ్యవస్థను స్వీకరించడం ఇతర దేశాల బ్రాండ్లకు తప్పని సరి. దానివల్ల వారి ఆన్లైన్ అమ్మకాలు కూడా పెరుగుతాయి’’ అన్నారు. నాణ్యత నియంత్రణ, సరైన ముడి పదార్థాలను ఎంచుకోవడంలో సహాయపడటానికి పాదరక్షలను బీఐఎస్ సర్టిఫై చేస్తుంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.