IPL 2024 Orange Cap: లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో వరుసగా రెండో మ్యాచ్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడినా.. ఆ టీమ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం సెంచరీతో ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో అతడు చేసిన మెరుపు సెంచరీ వృథా అయినా.. అది అతన్ని టాప్ లో ఉన్న విరాట్ కోహ్లికి చేరువ చేసింది. ఇక మెరుపు హాఫ్ సెంచరీ చేసిన శివమ్ దూబె ఈ లిస్టులో రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు.

ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ లిస్ట్ ఇదీ

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ కేవలం 60 బంతుల్లోనే 108 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ తో అతడు ఈ సీజన్లో 8 మ్యాచ్ లలో 349 రన్స్ చేశాడు. ప్రస్తుతం 379 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లి దగ్గరే ఉంది. అయితే అతనికి కేవలం 30 పరుగుల దూరంలోనే ఉన్నాడు రుతురాజ్. అంతేకాదు ఈ సెంచరీ ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా నిలిచాడు.

గతంలో కెప్టెన్ గా ఉన్న ధోనీ బెస్ట్ స్కోరు 84 పరుగులు కాగా.. ఆ రికార్డును రుతురాజ్ బ్రేక్ చేశాడు. మరోవైపు ఇదే మ్యాచ్ లో శివమ్ దూబె కూడా కేవలం 27 బంతుల్లో 7 సిక్స్ లు, 3 ఫోర్లతో 66 రన్స్ చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ లిస్టులో రోహిత్ శర్మను వెనక్కి నెట్టి దూబె ఆరోస్థానానికి వచ్చాడు. అతడు 8 మ్యాచ్ లలో 311 రన్స్ చేశాడు. అయితే ఈ ఇద్దరి మెరుపులు చెన్నైకి విజయం సాధించి పెట్టలేకపోయాయి.

ఇక ఆరెంజ్ క్యాప్ జాబితాలో కోహ్లి, రుతురాజ్ తర్వాత ట్రావిస్ హెడ్ (324), రియాన్ పరాగ్ (318), సంజూ శాంసన్ (314) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. రుతురాజ్ సెంచరీతో ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్న హెడ్ ను అధిగమించాడు.

ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ లిస్ట్

ఇక ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ జాబితాలో బుమ్రా టాప్ లోనే కొనసాగుతున్నాడు. చెన్నై, లక్నో మ్యాచ్ ప్రభావం ఈ లిస్టుపై పెద్దగా లేదు. బుమ్రా 13 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే లక్నోతో మ్యాచ్ లో ఒక వికెట్ తీసిన ముస్తఫిజుర్ రెహమాన్ 12 వికెట్లతో ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరాడు. ఆర్ఆర్ బౌలర్ చహల్ కూడా 13 వికెట్లు తీశాడు.

అయితే ఎకానమీ రేటు విషయంలో బుమ్రా మెరుగ్గా ఉండటంతో అతడు తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మధ్యే చహల్ ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మూడో స్థానంలో 13 వికెట్లతో హర్షల్ పటేల్ ఉన్నాడు. చహల్, హర్షల్ ఇద్దరూ గతంలో ఐపీఎల్ పర్పుల్ క్యాప్స్ అందుకున్న వాళ్లే.

ఈసారి కూడా వీళ్లు రేసులో ఉన్నారు. అయితే ఆర్ఆర్ ప్లేఆఫ్స్ చేరడం ఖాయంగా ఉండటంతో చహల్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బుమ్రా ఆడుతున్న ముంబై టీమ్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. దీంతో అతడు లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టనున్నాడు.