Rayudu on Mumbai Indians: ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్స్ లో ఒకడు అంబటి రాయుడు. అతడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆరుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నాడు. అయితే ఈ రెండు జట్లకు ఉన్న ప్రధాన తేడా ఏంటో తాజాగా రాయుడు చెప్పాడు. ముంబై ఇండియన్స్ కు ఎక్కువ రోజులు ఆడలేమని ఈ సందర్బంగా అతడు అనడం గమనార్హం.

ముంబై ఇండియన్స్‌పై రాయుడు కామెంట్స్ వైరల్

ముంబై ఇండియన్స్ టీమ్ ప్రధానంగా విజయాలపైనే దృష్టి పెడుతుందని, గెలుపే వారికి ముఖ్యమని అంబటి రాయుడు అన్నాడు. అదే సమయంలో సీఎస్కే మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పాడు. “సీఎస్కే ఎక్కువగా ప్రాసెస్ పైనే దృష్టి సారిస్తుంది. వాళ్లు మ్యాచ్ ఫలితాలను పెద్దగా విశ్లేషించరు.

ఫలితాల ఆధారంగా వాళ్ల మూడ్ ఆధారపడి ఉండదు. ముంబై ఇండియన్స్ కాస్త భిన్నమైనది. ఆ టీమ్ ఎలాగైనా గెవాలని అనుకుంటుంది. ఆ టీమ్ సంస్కృతి చూస్తే ప్రతిదీ విజయంపైనే ఆధారపడి ఉంటుంది. గెలవాల్సిందే అన్నదే వాళ్ల కల్చర్. గెలుపులో రాజీ లేదు అంటుంది” అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ రాయుడు అన్నాడు.

2010లో ముంబై ఇండియన్స్ తోనే రాయుడు తన ఐపీఎల్ జర్నీ మొదలు పెట్టాడు. 2017 వరకూ అందులోనూ కొనసాగాడు. ఈ క్రమంలో మూడుసార్లు టైటిల్ గెలిచాడు. ఇక 2018లో చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లాడు. అదే ఏడాది ఏకంగా 602 రన్స్ చేయడం విశేషం. ఆ జట్టుతోనే మూడు టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ రెండు ఛాంపియన్ టీమ్స్ గురించి అతడికి బాగా తెలుసు.

ముంబైకి ఎక్కువ రోజులు ఆడితే ఇక అంతే..

రెండు జట్లకూ ఆడినా చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడటాన్నే తాను ఎక్కువగా ఎంజాయ్ చేసినట్లు రాయుడు తరచూ చెబుతాడు. ఇప్పుడు కూడా ముంబై, చెన్నై జట్ల కల్చర్ గురించి చెబుతూ.. ముంబై ఇండియన్స్ కు ఎక్కువ రోజులు ఆడితే మన మెదడు పేలిపోతుందని అతడు అనడం గమనార్హం.

“సీఎస్కే, ఎంఐ రెండూ వేర్వేరు కల్చర్స్ కలిగి ఉన్న టీమ్స్. రెండు జట్లూ తీవ్రంగా శ్రమిస్తాయి. సీఎస్కేలో చాలా మంచి వాతావరణం ఉంటుందన్నది నా భావన. ముంబై ఇండియన్స్ తో ఎక్కువ సమయం గడిపితే మన మెదడు పేలిపోతుంది. ఆ జట్టుకు ఆడే సమయంలో నా ఆట చాలా మెరుగైంది.

అయితే మ్యాచ్ గెలవకపోతే మాత్రం దానికి సంజాయిషీలు ఏమీ ఉండవు. కచ్చితంగా రాణించాల్సిందే. ఓ ప్లేయర్ గా ఎప్పుడూ మెరుగయ్యే వాతావరణం ఎంఐలో ఉంటుంది. అదే చెన్నై సూపర్ కింగ్స్ లోనూ ప్లేయర్ గా మెరుగైనా.. ఇక్కడ పెద్దగా ఇబ్బంది లేకుండానే ఆ పని జరిగిపోతుంది” అని రాయుడు చెప్పాడు.

ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండూ ఐదేసి టైటిల్స్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి. రోహిత్ శర్మ, ధోనీ కెప్టెన్సీల్లో ఆ జట్లు ఐపీఎల్లో టాప్ పొజిషన్ కు వెళ్లాయి. ప్రస్తుతం సీజన్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ తడబడుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ కాస్త మెరుగ్గానే రాణిస్తోంది.