Nayattu Telugu OTT Release Date: మలయాళంలో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ నాయట్టు తెలుగులోనూ వస్తోంది. చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం (ఏప్రిల్ 23) సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది. తెలుగు వెర్షన్ ఓటీటీ హక్కులను ఆహా భారీ ధరకు దక్కించుకుంది.

నాయట్టు ఓటీటీ రిలీజ్ డేట్

పోలీస్ డ్రామా నాయట్టులో జోజు జార్జ్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమాలో అతని నటనే హైలైట్ గా నిలిచింది. ఇప్పుడీ నాయట్టు మూవీ తెలుగులో వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 26) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ఈ మూవీ రానుండటం విశేషం. ఆహా ఓటీటీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

“పోలీస్ వెంట పోలీస్ పడితే.. వస్తోంది చుండూరు పోలీస్ స్టేషన్ మీ ఆహాలో..” అనే క్యాప్షన్ తో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మూవీ తెలుగు వెర్షన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులోనూ నాయట్టు ఇన్ తెలుగు అని కూడా చెప్పారు. ఇది తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ. ఈ మధ్యే మరో మలయాళ మూవీ ప్రేమలు తెలుగు వెర్షన్ కూడా ఆహాలోనే వచ్చిన విషయం తెలిసిందే.

నాయట్టు రీమేక్

నిజానికి ఇప్పటికే తెలుగులో ఈ నాయట్టు రీమేక్ కూడా అయింది. కోటబొమ్మాళి పీఎస్ పేరుతో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివానీ రాజశేఖర్ నటించిన మూవీ తెలుగులో వచ్చింది. ఈ సినిమా కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ మూవీ మలయాళ మాతృకను తెలుగులోకి డబ్ చేసిన తీసుకొస్తుండటం విశేషం. ఇప్పటికే రీమేక్ అయిన మూవీని అదే ఆహా ఇలా తీసుకురావడం ఆశ్చర్యం కలిగించేదే.

తెలుగులో రీమేక్ అయినా కూడా మలయాళ ఒరిజినల్ నాయట్టకు కూడా బజ్ క్రియేటైంది. ఈ మధ్య ఆ ఇండస్ట్రీ రీమేక్స్ కంటే కూడా ఒరిజినల్స్ నేరుగా చూడటానికే తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మార్టిన్ ప్రకత్ డైరెక్ట్ చేసిన ఈ నాయట్టు మూవీ 2021లో రిలీజైంది. ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకు ప్రధాన హైలైట్ గా చెప్పొచ్చు.

కొవిడ్ 19 కంటే ముందే ఈ నాయట్టు మూవీ షూటింగ్ పూర్తయింది. కానీ రిలీజ్ ను మాత్రం వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా థియేటర్లలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత గతేడాది నవంబర్ 24న తెలుగులోనూ కోటబొమ్మాళి పీఎస్ పేరుతో రిలీజైంది.

ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగిన వసూళ్లే సాధించింది. తర్వాత ఆహా ఓటీటీలోనూ సినిమా సక్సెసైంది. మరి ఇప్పుడు మలయాళ డబ్బింగ్ వెర్షన్ ను తెలుగు ప్రేక్షకుల ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి.