Jai Hanuman Poster: ఈ ఏడాది హనుమాన్ మూవీతో టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమాలోనే సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడీ మూవీకి జై హనుమాన్ పేరుతో సీక్వెల్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీని ప్రారంభించిన అతడు.. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఓ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశాడు.

జై హనుమాన్ పోస్టర్

తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెలుసు కదా. 90 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలిచింది. దీంతో ఈ సినిమాకు జై హనుమాన్ పేరుతో సీక్వెల్ తీసుకు వస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది.

ఊహించినట్లే ఈ పోస్టర్ చాలా పవర్‌ఫుల్ గా ఉంది. ఇందులో ఓ ఎత్తయిన శిఖరంపై చేతిలో గదతో హనుమాన్ నిల్చొగా.. పైన గాల్లో నుంచి నిప్పులు కక్కుతూ ఓ డ్రాగన్ వస్తున్నట్లుగా ఈ పోస్టర్ రూపొందించారు. ఇండియన్ సినిమాలో తొలిసారి డ్రాగన్లను ప్రశాంత్ వర్మ తీసుకొస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. అంతేకాదు హనుమాన్ కంటే ఈ జై హనుమాన్ మరో రేంజ్ లో ఉండనున్నట్లూ తెలుస్తోంది.

హనుమాన్ మూవీ అంచనాలకు మించి హిట్ అవడంతో సీక్వెల్ ను మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ సిద్ధమైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో సినిమా ఇది. మొత్తంగా ఇండియన్ సూపర్ హీరోల సినిమాలు 12 తీయనున్నట్లు గతంలోనే అతడు చెప్పాడు. హనుమాన్ తర్వాత మరో హిందూ దేవుడే సూపర్ హీరోగా మరో సినిమా చేయనున్నాడు.

దానికి ముందు ఈ సీక్వెల్ జై హనుమాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు హనుమాన్ ఎండ్ క్రెడిట్స్ సమయంలోనే మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇక ఈ సినిమాను ఐమ్యాక్స్ 3డీ వెర్షన్ లోనూ తీసుకురానున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు.

హనుమాన్ 100 రోజులు

మరోవైపు హనుమాన్ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చినా.. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ 25 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. మంగళవారం (ఏప్రిల్ 23) మూవీ మేకర్స్ 100 రోజుల వేడుకను జరుపుకోనున్నారు. అంతకుముందే ఈ జై హనుమాన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

హనుమాన్ తో అంచనాలు భారీగా పెంచేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడీ జై హనుమాన్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక హనుమాన్ మూవీ వచ్చే ఆదివారం (ఏప్రిల్ 28) సాయంత్రం 5.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ విషయాన్ని జీ తెలుగు ఛానెల్ అధికారికంగా అనౌన్స్ చేసింది.