Allari Naresh Aa Okkati Adakku Trailer Launch: మొన్నటివరకు కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ రోల్స్‌లో ఆకట్టుకున్న అల్లరి నరేష్ మరోసారి తన మార్క్ కామెడీ సినిమాతో రానున్నారు. అల్లరి నరేష్ లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తోన్నో కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమాతో నూతన దర్శకుడిగా మల్లి అంకం పరిచయం అవుతున్నారు.

సోమవారం (ఏప్రిల్ 23) రోజున ఆ ఒక్కటి అడక్కు సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నానిపై, ఆ ఒక్కటి అడక్కు సినిమాపై అల్లరి నరేష్ కామెంట్స్ చేశారు.

“ముందుగా మా బాబాయ్ నానికి థ్యాంక్స్. అడగ్గానే వచ్చిన బాబాయ్ నాని మా ఫ్యామిలీ మెంబర్‌లానే ఉంటారు. తను ఈ వేడుకకు రావడం చాలా అనందంగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీం ఎఫర్ట్, రవి గారి మాటలు, మల్లి గారి డైరెక్షన్, సూర్య గారి కెమరా వర్క్, చోటా గారి ఎడిటింగ్, నిర్మాత రాజీవ్ గారు.. అందరం కలసి కష్టపడి ఇష్టపడి అద్భుతంగా చేసిన సినిమా ఇది” అని అల్లరి నరేష్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

“చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కామెడీ మూవీతో వస్తున్నాను. కచ్చితంగా ఈ సమ్మర్‌లో మిమ్మల్ని బాగా నవ్విస్తాను. ఇందులో నవ్విస్తూ మంచి కంటెంట్ కూడా చెప్తాను. తప్పకుండా ఈ సినిమా మే3న చూడండి” అని అల్లరి నరేష్ కోరారు. అనంతరం ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోన్న ఫరియా అబ్దుల్లా స్పీచ్ ఇచ్చారు.

“ఆ ఒక్కటీ అడక్కు బ్యూటీఫుల్ స్టొరీ, కాన్సెప్ట్. ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ది. మీరంతా చిట్టి చిట్టి అని పిలుస్తారు. సిద్ది అని పిలిచినా బావుటుంది. ( నవ్వుతూ). నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు మల్లి గారు, టీం అందరి సపోర్ట్‌కి ధన్యవాదాలు. అందరూ ఇష్టపడే సినిమా ఇది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. నాని గారు సపోర్ట్ చేయడానికి రావడం చాలా స్ఫూర్తినిచ్చింది” అని ఫరియా అబ్దుల్లా తెలిపారు.

“నాని గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మల్లి చాలా చక్కగా తెరకెక్కించారు. తొలి సినిమా నిర్మాతలమైన మాతో సినిమా చేసినందుకు అల్లరి నరేష్ గారికి ధన్యవాదాలు. నరేష్ గారితో వర్క్ చేయడం మంచి అనుభవం. ఫరియాకు మిగతా చిత్ర యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు” అని నిర్మాత రాజీవ్ చిలక తెలిపారు.

“ఈ సినిమా చాలా సందడిగా గోల గోలగా ఉంటుంది. వినోదంతో పాటు చివర్లో అందరికీ ఉపయోగపడే మాట ఉంటుంది. అందరికోసం తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అని రచయిత అబ్బూరి రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్‌లోకి వెళితే.. హీరోకు పెళ్లి కాలేదని చెప్పే ఎపిసోడ్‌తో ట్రైలర్‌ స్టార్ట్ అవుతుంది. హీరోకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా 49 సార్లు వివిధ అమ్మాయిలు అతన్ని రిజెక్ట్ చేస్తారు. మ్యారేజ్ బ్యూరోలు కూడా తనకి తగిన జోడి వెతకడంలో విఫలం కావడం నవ్వు తెప్పించేలా ఉంది.