Sanju Samson: హార్దిక్ పాండ్య పేల‌వ ఫామ్‌పై గ‌త కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్నాయి. గ‌త రెండు సీజ‌న్స్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు హార్దిక్ పాండ్య. ఓ సీజ‌న్‌లో విన్న‌ర్‌గా, మ‌రో సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా జ‌ట్టునునిలిపాడు. ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ నుంచి ముంబై అత‌డిని కొనుగోలు చేసింది. రోహిత్ శ‌ర్మ‌ను కాద‌ని ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ హార్దిక్ పాండ్య‌కు కెప్టెన్సీ ప‌గ్గాలు అప్ప‌గించింది.

కానీ పాండ్య కెప్టెన్సీలో ముంబై ఎనిమిది మ్యాచుల్లో మూడు విజ‌యాల‌తో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ పాండ్య దారుణంగా విఫ‌ల‌మ‌వుతోన్నాడు. సోమ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు బ్యాటింగ్ దిగిన పాండ్య ప‌ది బాల్స్‌లో ప‌ది ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు.

హ‌ర్భ‌జ‌న్ సింగ్ ట్రోల్స్‌…

రాజ‌స్థాన్ చేతిలో ముంబై ఓట‌మి అనంత‌రం మ‌రోసారి హార్దిక్ పాండ్య‌ను ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. పాండ్య‌ను ట్రోలింగ్ చేసిన వారి జాబితాలో తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా చేరాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా పాండ్య కంటే సంజూ శాంస‌న్ బెస్ట్ అంటూ కామెంట్స్ చేశాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌.

సంజూ శాంస‌న్ బెస్ట్‌…

సంజూ శాంస‌న్ ఆట‌తీరుపై భ‌జ్జీ ప్ర‌శంస‌లు కురిపించాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా వికెట్ కీప‌ర్‌గా సంజూ శాంస‌న్‌ను బెస్ట్ ఆప్ష‌న్ అని హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెప్పాడు. సంజూ శాంస‌న్ ఆట‌తీరు చూస్తుంటే టీ20 జ‌ట్టులో అత‌డి స్థానం ఖ‌రారైన‌ట్లుగానే క‌నిపిస్తోంద‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెప్పాడు.

సంజూ శాంస‌న్ నాయ‌క‌త్వ ప‌ఠిమ అమోఘ‌మ‌ని, టీ20 ఫార్మెట్‌లో రోహిత్ శ‌ర్మ త‌ర్వాత సంజూ శాంస‌న్‌ను టీమిండియా కెప్టెన్‌గా నియ‌మించ‌డం మంచిద‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ అన్నాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌ట్టును అత‌డైతేనే స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు న‌డిపించ‌గ‌ల‌ని అనిపిస్తోంద‌ని తెలిపాడు. హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్స్‌…

ఇన్‌డైరెక్ట్‌గా హార్దిక్ పాండ్య పూర్ ఫామ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సెటైర్స్ వేశాడ‌ని క్రికెట్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. టీ20 ఫార్మెట్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి హార్దిక్ పాండ్య‌ను త‌ప్పించాల‌ని చెప్ప‌క‌నే హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెప్పాడ‌ని అంటున్నారు.

314 ర‌న్స్…

సంజూ శాంస‌న్ ఈ ఐపీఎల్‌లో అద‌ర‌గొడుతోన్నాడు. ఎనిమిది మ్యాచుల్లో 62 యావ‌రేజ్‌తో 314 ర‌న్స్ చేశాడు. సంజూ నాయ‌క‌త్వంలో రాయ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ కూడా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఎనిమిది మ్యాచుల్లో కేవ‌లం ఒకే ఒక ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. చివ‌ర‌గా టీమిండియా త‌ర‌ఫున గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో వ‌న్డే మ్యాచ్ ఆడాడు సంజూ శాంస‌న్‌. జ‌న‌వ‌రిలో అప్ఘ‌నిస్తాన్‌పై లాస్ట్ టీ20 మ్యాచ్ ఆడాడు. మ‌రోవైపు ఈ ఐపీఎల్‌లో పాండ్య బ్యాటింగ్‌లో 151 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 39 అత‌డి బెస్ట్ స్కోర్‌. బౌలింగ్‌లో కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే తీసుకున్నాడు. ముంబై ప్లే అప్ ఆశ‌లు కూడా సంక్లిష్టంగా మారాయి.