posted on Apr 23, 2024 9:37AM

పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి.  గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి  కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తరువాత కూడా ఆ పార్టీలో ఆ విషయంలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో  పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పడుతున్న మల్లగుల్లాలే నిదర్శనం. రానున్న లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో  కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్ సభ స్థానమే అనడంలో సందేహం లేదు

. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక్క స్థానం వినా జిల్లాలోని అన్ని స్థానాలనూ కైవశం చేసుకుంది. ఒక్క స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినా… ఆయనా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అటువంటి జిల్లాకు కేంద్రమైన ఖమ్మం లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పలు దఫాలు హైకమాండ్ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపినా అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 25 నామినేషన్ గడువు ముగుస్తుంది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి ఎవరన్నది తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉంది.  తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ, ఏప్రిల్ 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా కాంగ్రెస్ మాత్రం ఇంకా  మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేక ఆపసోపాలు పడుతోంది.  ఈ జాప్యం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నది.  

కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పక్కన పెడితే.. ఖమ్మం లోక్ సభ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మాత్రం పార్టీ హైకమాండ్ కు సైతం తలనొప్పిగా మారింది. ఈ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిత్వం  తమ వారికే ఇవ్వాలంటూ రేవంత్ కేబినెట్ లోని ఇద్దరు కీలక మంత్రులు గట్టిగా పట్టుబట్టడంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక    వివాదాస్పదంగా మారింది.    ఖమ్మం టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి, కాదు కాదు తన సతీమణి నిందినికే అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టిగా పట్టుబడుతుండటంతో ఎంపికలో జాప్యం జరుగుతోంది.  ఈ విషయంలో ఇహనో ఇప్పుడో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఈ జాప్యం పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందా అన్న ఆందోళన కేడర్ లో వ్యక్తం అవుతోంది.