Web Series: స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత నటుడిగానూ మారిన జాకిర్ ఖాన్ తన సూపర్ హిట్ వెబ్ సిరీస్ చాచా విధాయక్ హై హమారె మూడో సీజన్ తీసుకొస్తున్నాడు. స్టాండప్ కామెడీతోపాటు ఈ సిరీస్ ద్వారా తనలో ఓ మంచి నటుడు కూడా ఉన్నాడని నిరూపించిన జాకిర్.. ఇప్పటికే రెండు సీజన్ల ద్వారా అలరించగా.. ఇప్పుడు మూడో సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశాడు.

చాచా విధాయక్ హై హమారె మూడో సీజన్

జాకిర్ ఖాన్ నటించిన ఈ చాచా విధాయక్ హై హమారె వెబ్ సిరీస్ తొలి సీజన్ 2018లో వచ్చింది. ఆ తర్వాత రెండో సీజన్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడు మూడో సీజన్ తో జాకిర్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ సోమవారం (ఏప్రిల్ 22) ప్రేక్షకుల ముందుకు రాగా.. సిరీస్ గురువారం (ఏప్రిల్ 25) నుంచి అమెజాన్ మినీటీవీలో స్ట్రీమింగ్ కానుంది.

మా బాబాయ్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ తిరిగే వ్యక్తి.. అదే ఎమ్మెల్యే పదవికి నిలబడే స్థాయికి ఎలా ఎదిగాడన్నదే ఈ సిరీస్ కథ. తొలి రెండు సీజన్లు బాగా నవ్వించింది. జాకిర్ ఖాన్ కామెడీ టైమింగ్ బాగా ఆకట్టుకుంది. దీంతో మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. ఈ కొత్త సిరీస్ ట్రైలర్ ను జాకిర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు.

గుండెల మీద చేయి వేసుకొని కూర్చోండి.. ఎందుకంటే చాచా విధాయక్ హై హమారె సీజన్ 3 వచ్చేస్తోంది అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను అతడు షేర్ చేశాడు. రోనీ అనే ఓ సగటు వ్యక్తి చేసే సాహసాలు, అవి అతనికి తీసుకొచ్చే కష్టాలు చుట్టూ సరదాగా సాగిపోయే కథే ఇది. ఈ మూడో సీజన్లో అతడు నేరుగా ఎమ్మెల్యే పదవి కోసం పోటీ పడటం, దానివల్ల తాను ఎదుర్కొనే కష్టాలను చూపించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

అమెజాన్ మినీటీవీ తెలుగులో..

అమెజాన్ మినీటీవీ ఓ ఓటీటీ. ఇందులోని సినిమాలు, వెబ్ సిరీస్ అన్నీ ఫ్రీగా చూడొచ్చు. అమెజాన్ షాపింగ్ యాప్ లోనూ ఇది అందుబాటులో ఉంది. ఇప్పుడీ మినీటీవీలోని సినిమాలు, షోలు తెలుగులోకీ రావడం విశేషం. సూపర్ హిట్ హాలీవుడ్, కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ తోపాటు హిందీ మూవీస్, సిరీస్ లను కూడా తెలుగులోకి డబ్ చేసి తీసుకొచ్చారు.

ఇప్పుడదే మినీటీవీలో ఈ చాచా విధాయక్ హై హమారె సిరీస్ చూడొచ్చు. తొలి రెండు సీజన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ వాటిని చూడకపోయి ఉంటే.. ఈ కొత్త సీజన్ ప్రారంభానికి ముందే చూసేయండి. అమెజాన్ మినీటీవీలో యూత్ మెచ్చే వెబ్ సిరీస్ ఎన్నో ఉన్నాయి. ఎలాగూ ఫ్రీగానే కావడంతో వాటిని కూడా మిస్ కాకుండా చూడండి.