HanuMan 100 Days: సూపర్ హీరో సినిమా హను-మాన్’ థియేటర్లలో భారీ బ్లాక్ బస్టర్ అయింది. హనుమంతుడు స్ఫూర్తిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలకు మించి సూపర్ హిట్ సాధించింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. తెలుగుతో పాటు హిందీ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది. తీవ్రమైన పోటీ ఉన్నా విజేతగా నిలిచింది. నేటితో (ఏప్రిల్ 22) ఈ సినిమా వంద రోజుల మైలురాయి చేరింది.

100 రోజులు ఎన్ని థియేటర్లలో..

హనుమాన్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుందని మూవీ టీమ్ నేడు వెల్లడించింది. చరిత్రాత్మక 100 రోజులు అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ప్రేక్షకుల మనసులో ఈ చిత్రం నిలిచిపోయిందని ప్రైమ్‍షో ఎంటర్‌టైన్‍మెంట్ ట్వీట్ చేసింది.

హనుమాన్ చిత్రం 25 థియేటర్లలో 100 రోజుల సెలెబ్రేషన్స్ చేసుకుంటోందని మూవీ టీమ్ వెల్లడించింది. “హిస్టారికల్ బ్లాక్‍బస్టర్ హనుమాన్ చిత్రం 100 రోజులను 25 సెంటర్లలో సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఇది అరుదైన ఘనత. అభిమానుల మనసుల్లో చోటును దక్కించుకొని హనుమాన్ మరో విజయాన్ని దక్కించుకుంది” అని పోస్ట్ చేసింది.

ఇటీవలి కాలంలో 100 రోజుల థియేట్రికల్ రన్ అనేది చాలా అరుదుగా మారిందని, అయితే ఈ మైల్‍స్టోన్‍ను తమకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. హనుమాన్ మూవీ థియేటర్లలో 100 రోజులను జరుపుకోవడం తనకు జీవితాంతం గుర్తుంటుందని పేర్కొన్నారు.

ఓటీటీల్లోకి వచ్చినా..

హనుమాన్ సినిమా ఓటీటీల్లోకి వచ్చినా.. ఇంకా కొన్ని థియేటర్లలో నడుస్తోంది. 25 థియేటర్లలో 100 రోజులను పూర్తి చేసుకుందని మూవీ టీమ్ కూడా వెల్లడించింది. హనుమాన్ చిత్రం తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉంది. ఎంత హిట్ అయినా ఇటీవలి కాలంలో సినిమాలు నెల రోజులు థియేటర్లలో ఆడడం లేదు. అలాంటిది థియేటర్లలో హనుమాన్ 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషమే. అది కూడా ఓటీటీలోకి వచ్చాక కూడా ఇంకా కొన్ని థియేటర్లలో రన్ అవుతోంది.

హనుమాన్ తెలుగు టీవీ ప్రీమియర్

హనుమాన్ సినిమా టీవీలో ప్రసారమయ్యేందుకు కూడా ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఇప్పటికే హిందీ వెర్షన్ కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్‍లో టెలికాస్ట్ కాగా.. ఇప్పుడు తెలుగులో జీ తెలుగు ఛానెల్‍లో ఏప్రిల్ 28న రానుంది.