Aa Okkati Adakku Trailer: అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాపై మొదటి నుంచి చాలా ఆసక్తి ఉంది. మూడేళ్లుగా సీరియస్ చిత్రాలు చేస్తున్న అల్లరి నరేశ్ మళ్లీ తన మార్క్ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ చేస్తుండటంతో హైప్ బాగా క్రియేట్ అయింది. ఈ మూవీకి మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఆ ఒక్కటి అడక్కు సినిమా ట్రైలర్ నేడు (ఏప్రిల్ 22) రిలీజ్ అయింది. నరేశ్ పంచ్‍లతో ఈ ట్రైలర్ అదిరిపోయింది.

పెళ్లి కోసం ఆరాటం

వరుస పంచ్‍లు, కామెడీతో ఆ ఒక్కటి ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది. చివర్లో కాస్త యాక్షన్ టచ్ కూడా ఉంది. పెళ్లి చేసుకునేందుకు ఆరాట పడే యువకుడిగా అల్లరి నరేశ్ ఈ చిత్రంలో నటించారు.

పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ వెళ్లగా.. ఏ విధంగా సహాయపడగలను అంటూ నరేశ్‍ను హరితేజ అడుగుతారు. దీంతో.. “ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారా” అంటూ సెటైరికల్ పంచ్ వేస్తాడు అల్లరి నరేశ్. ఈ మూవీలో వివాహం కోసం తంటాలు పడే గణ పాత్ర చేశాడు నరేశ్. పెళ్లి ఎప్పుడు అంటూ అందరూ అతడిని అడుగుతుంటారు. వివాహం కోసం ప్రయత్నాల్లో ఉండగానే ఫారియా అబ్దుల్లా అతడి జీవితంలోకి వస్తుంది.

50వ సంబంధంపై టెన్షన్!

తాను ఇప్పటి వరకు 200 పెళ్లి చేయించానని నరేశ్ అంటే.. మీరు పంతులు గారా అంటూ ఫారియా పంచ్ వేస్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‍లో యాక్షన్ సీన్ ఉంది. “49 సంబంధాలు చూసినా.. పెళ్లవక 50వ సంబంధం సెట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతుంటే.. పెళ్లాం, పిల్లలు అని బెదిరిస్తావా” అంటూ అల్లరి నరేశ్ డైలాగ్ ఉంది. కాస్త మర్డర్ మిస్టరీ కూడా ఉంటుందనేలా ట్రైలర్‌లో అనిపిస్తోంది.

ట్రైలర్ చివర్లో కోర్టులో అల్లరి నరేశ్ చెప్పే డైలాగ్ హైలైట్‍గా ఉంది. “యువరానర్.. నాదొక చిన్న రిక్వెస్ట్.. మాలాంటి పెళ్లి కాని వాళ్లకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమనండి. పెళ్లెప్పుడు.. పెళ్లెప్పుడు అని దొబ్బేవాళ్లని ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి.. ప్లీజ్” అనే డైలాగ్‍తో ట్రైలర్ ఎండ్ అయింది.

ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అల్లరి నరేశ్, ఫారియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, జామీ లేవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ, హరితేజ కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి అబ్బూరి రవి రచయిత కాగా.. మల్లి అంకం దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ల పంచ్ డైలాగ్‍లు బాగానే పేలాయి. ఈ మూవీకి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

రిలీజ్ డేట్ ఇదే..

ఆ ఒక్కటి అడక్కు చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ముందుగా ఈ మూవీని మార్చి 22న విడుదల చేయాలని మూవీ టీమ్ భావించింది. అయితే, సడెన్‍గా వాయిదా వేసింది. ఎట్టకేలకు మే 3ను ఫిక్స్ చేసింది. ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ఈ మూవీని నిర్మించారు. సూర్య సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు.