సబ్-4 మీటర్ కార్ల మార్కెట్‌ను షేక్ చేయడమే టార్గెట్.. సరికొత్త లుక్‌తో వస్తున్న మహీంద్రా విజన్ s
ప్రస్తుత భారత ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ, పవర్ఫుల్ ఎస్యూవీ కార్ల తయారీలో మహీంద్రా కంపెనీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఎస్యూవీ కార్లను మాత్రమే నమ్ముకుని హ్యుందాయ్ లాంటి కార్ల తయారీ కంపెనీలను కూడా మహీంద్రా దాటేసింది. ప్రస్తుతం టాటా మోటార్స్ తో గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలోనే తన కార్ల పోర్ట్ ఫోలియోను ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో అప్డేట్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మహీంద్రా తన సరికొత్త ‘NU IQ’ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మల్టీ ఎనర్జీ ఆప్షన్లతో కూడిన విజన్ ఎస్ (Vision S) మోడల్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
టెస్టింగులో దొరికిని మహీంద్ర ఎస్
మహీంద్రా విజన్ S అనేది 4 మీటర్ల కంటే తక్కువ పొడవుండే సబ్ 4 మీటర్ కేటగిరీ SUV. ఈ కారుకు సంబంధించిన టెస్టింగ్ మోడల్ ఇటీవల రోడ్ల మీద తిరుగుతూ కెమెరా కంటికి చిక్కింది. ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ torque_bhai ద్వారా బయటకు వచ్చిన స్పై వీడియోలను బట్టి, ఇది కారు మిడ్ స్పెక్ లేదా అప్పర్ మిడ్ స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే, ఈ కారు టాప్ వేరియంట్లలో ఇంకా మరెన్నో లగ్జరీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని అర్థం అవుతుంది.

కారు లోపల ఎలా ఉండబోతుందంటే ?
ఈ కొత్త కారు లోపల చాలా మార్పులు కనిపిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం.. ఇందులో దాదాపు 12.3 ఇంచుల పొడవైన TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నిలువుగా ఉండే (లాంగ్ అండ్ స్క్వేర్) టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇక ఏసీ వెంట్స్ వర్టికల్ డిజైన్‌లో ఉండగా, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ చూసేందుకు మహీంద్రా థార్ రాక్స్ లేదా స్కార్పియో N మోడళ్లను పోలి ఉంది. అలాగే ఈ టెస్టింగ్ కారులో మాన్యువల్ హ్యాండ్‌బ్రేక్, నార్మల్ గేర్ లివర్, ఫ్యాబ్రిక్ సీట్లు కనిపించాయి. కారు లోపలికి ఎక్కడానికి, దిగడానికి వీలుగా థార్ తరహాలోనే ప్రత్యేకమైన హ్యాండిల్స్ కూడా అందించారు.
ఒకే కారు.. ఎన్నో రకాల ఇంజన్ ఆప్షన్లు
మహీంద్రా విజన్ S కారును ప్రత్యేకమైన NU IQ ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది మల్టీ-ఎనర్జీ ఆర్కిటెక్చర్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే, ఈ ఒక్క ప్లాట్‌ఫారమ్‌పైనే పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు ఎలక్ట్రిక్ (EV), హైబ్రిడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లను కూడా మహీంద్రా తయారు చేయగలదు. స్పై షాట్స్‌లో కనిపించిన స్టీరింగ్ వీల్ ఇటీవల కాన్సెప్ట్ రూపంలో చూపించిన BE 6 ఎలక్ట్రిక్ కారును పోలి ఉంది. దీన్ని బట్టి విజన్ S మోడల్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రాబోతోందని గట్టిగా వినిపిస్తోంది.
గ్లోబల్ మార్కెట్‌పై మహీంద్రా కన్ను
ఈ కారు స్టీరింగ్ వీల్‌కు కుడివైపున ఒక ప్రత్యేకమైన నాబ్ కనిపించింది. సాధారణంగా యూరోపియన్ కార్లలో హెడ్‌లైట్లను కంట్రోల్ చేయడానికి ఇలాంటి నాబ్స్ ఇస్తుంటారు. దీన్ని బట్టి మహింద్ర ఈ కారును కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తోందని అర్థమవుతోంది. గతంలో టాటా కంపెనీ కూడా హెక్సా కారుతో ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ, అది ఎక్కువ కాలం నిలదొక్కకోలేకపోయింది. కానీ, మహీంద్రా మాత్రం ఈ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది.

రాబోయే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఏంటి?
గతంలో వచ్చిన రిపోర్టుల ప్రకారం, ఈ కారు టాప్ వేరియంట్లలో లగ్జరీ ఫీచర్లకు కొదవ ఉండదు. ఇందులో పనోరమిక్ సన్ రూఫ్, లెవెల్-2 ADAS (రాడార్ బేస్డ్ సేఫ్టీ సిస్టమ్), ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ ఉండబోతున్నాయి. డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉండటం కూడా ఖాయం కాగా, మైలేజ్ పెంచే హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
పోటీదారులకు టెన్షన్
ప్రస్తుతం సబ్ 4 మీటర్ కేటగిరీలో మహీంద్రాకు కేవలం XUV3XO, 3 డోర్ థార్ మాత్రమే ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో మరింత పట్టు సాధించేందుకు విజన్ S మహీంద్రాకు పెద్ద ఆయుధం కానుంది. మార్కెట్లోకి ఇది లాంచ్ అయిన తర్వాత.. ప్రస్తుతం టాప్‌లో దూసుకుపోతున్న టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.







