ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది?

ఏపీలో 26వ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరపింది. అంగన్వాడీల పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే అన్ని డిమాండ్ల పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీలు అంటున్నారు. ముఖ్యంగా జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ శనివారం జీఓ నెం.2 తీసుకొచ్చింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలలు పాటు సమ్మెను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసులు కిందకు రానప్పటికీ, వారిని అత్యవసర సర్వీసుల కింద పరిగణిస్తూ ప్రభుత్వం ఈ జీఓ తీసుకువచ్చింది. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తారని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 1971 ఎస్మా చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తే వారిని డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీంతో పాటు సమ్మెలో ఉన్నవారిని విచారించే అవకాశం ఉంటుంది. సమ్మె చేసిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఎస్మా చట్టం చెబుతోంది.