Saturday Motivation: ప్రముఖ భారతీయ రచయిత చేతన్ భగత్. ఈయన రాసిన పుస్తకాలు ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈ సంవత్సరం మరో కొత్త పుస్తకంతో ఆయన మన ముందుకు వచ్చారు. ‘11 రూల్స్ ఫర్ లైఫ్’ అనే ఈ పుస్తకం ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో విజయం సాధించడానికి మనిషికి మార్గ నిర్దేశం చేసే ఎన్నో అంశాలు ఉన్నాయి.

తన పుస్తకంలో జీవితంలో విజయం సాధించడానికి బొద్ధింకలా జీవించడం నేర్చుకోవాలని రాశారు చేతన్ భగత్. ఇతర ఏ జీవితో పోల్చుకొని మనిషి జీవించినా కూడా అతను విజయవంతమైన జీవితాన్ని గడపలేకపోవచ్చని, బొద్దింకలా బతకడం నేర్చుకుంటే జీవితాన్ని విజయవంతంగా ముగిస్తాడని అన్నారు.

బొద్దింకలా ఎందుకు?

చార్లెస్ డార్విన్ చెప్పిన ప్రకారం ప్రకృతిలో మనుగడ సాధించేది బలమైన జీవి లేదా అత్యంత తెలివైన జీవి కాదు. పరిస్థితులకు ప్రకృతికి తగ్గట్టు తనను తాను అనుకూలంగా మార్చుకునే జీవి. అదే బొద్దింక. బొద్దింక పేరు చెబితే మీలో అసహ్యమైన భావన పుట్టవచ్చు. చెబుతున్నవారు పిచ్చోళ్ళలా కనిపించవచ్చు. కానీ ఆలోచించి చూడండి. బొద్దింకలను ఎవరూ ఇష్టపడకపోవచ్చు… కానీ ఇతర జీవులతో పోలిస్తే ఈ భూమిపై ఎక్కువకాలం పాటు మనుగడ సాగిస్తున్నది బొద్దింకల జాతే.

భూమిపై జరిగిన అన్ని మార్పులను స్వీకరించడం బొద్దింక నేర్చుకుంది. ఆ స్వీకరించే సామర్థ్యం బొద్దికంలో ఉంది, కాబట్టే ఆ జాతి వందల ఏళ్లుగా ఈ భూమిపై ప్రతి పరిస్థితిని, ప్రకృతి మార్పులను తట్టుకుంటూ జీవిస్తూనే వస్తోంది. ఎన్నో జీవజాతులు భూమిపై వస్తున్న మార్పులను తట్టుకోలేక అంతరించిపోయాయి. కానీ బొద్దింక మాత్రం తనను తాను పరిస్థితులకు తగ్గట్టు అనుకూలంగా మార్చుకొని జీవిస్తూ వస్తోంది. అందుకే బలమైన జంతువును ఆదర్శంగా తీసుకోకండి… పరిస్థితులకు తగ్గట్టు ప్రకృతిలో మమేకమై జీవిస్తున్న బొద్దింకను ఆదర్శంగా తీసుకోండి… అంటున్నారు చేతన్ భగత్.

అతను చెబుతున్న ప్రకారం మీరు ఎంత తెలివైన వారైనా, ఎంత బలవంతులైనా… ప్రకృతికి అవసరం లేదు. తనకు తగ్గట్టు కాలానుగుణంగా మారడం నేర్చుకుంటేనే, అలవాటు పడితేనే ఈ ప్రకృతిలో జీవించగలరు. లేకుంటే జాతి మొత్తం నశించిపోతుంది. అంతెందుకు మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ అనే పెద్ద జంతువులు ఉండేవి. ఈ భూమి మీద జీవించిన అతి పెద్ద జంతువులు అవే. ఏనుగుల కంటే చాలా బలమైనవి. వాటిని ఎవరూ కావాలని నాశనం చేయలేదు. అప్పట్లో అవే ప్రపంచాన్ని పాలించాయి. ఎప్పుడైతే మంచు కరగడం ప్రారంభమైందో, టెక్టోనిక్ ప్లేట్లు మారడం మొదలైందో డైనోసార్లు కొత్త వాతావరణానికి సర్దుబాటు కాలేకపోయాయి. చివరికి జాతి మొత్తం అంతరించిపోయింది. అప్పుడు కూడా ఈ బోద్దింకలు ఈ భూమిపై జీవించే ఉన్నాయి.

ప్రకృతిలో వచ్చిన మార్పులను ఈ బొద్దింకలు స్వీకరించాయి. తమను తాము అందుకు అనుగుణంగా మార్చుకున్నాయి. అందుకే బలమైన జీవి అయిన డైనోసార్ అంతరించిపోయినా… బొద్దింకలు ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలంటే సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. పరిస్థితులు, ప్రకృతికి తగ్గట్టు తనను తాను మార్చుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించగలడు.

ఆదిమ మానవుడు కూడా అలా తనను తాను మార్చుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు ఆదిమమానవుడు ఆకులు తిని బతికేవాడు. తరువాత కీటకాలు తిన్నాడు. తరువాత పచ్చిమాసం… కాల్చిన మాంసం తిని బతికేవాడు. ఇప్పుడు తృణధాన్యాలు, బియ్యం తిని బతుకుతున్నాడు. అలాగే జీవితంలో కూడా ప్రతి విషయంలో సర్దుకుపోవడం పరిస్థితిలకు అనుకూలంగా జీవించడం నేర్చుకుంటే ఆ వ్యక్తి తాను అనుకున్నది ఎప్పటికైనా సాధించగలడు.