Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌లో నేను భయపడినట్లుగానే జరిగింది. ఈరోజు బాబు గురించి ప్రశ్న తలెత్తింది. ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు అబద్ధం చెప్పలేదు. కానీ, నా చేత చెప్పించారు. అక్కడ వినోదం చూసినవాళ్లు ఇక్కడ సైలెంట్‌గా ఉంటానంటే ఒప్పుకోను. నేను ఎవరిని అడగాలి. ఎవరిని ప్రశ్నించాలి. నాకు కావాల్సింది సమాధానం. మౌనం కాదు అని అపర్ణ అంటుంది.

పరువు నిలబడింది కదా

నాకు నచ్చినట్లు ఇంటికి కోడలు రాలేదు. అలా వచ్చి తనతో బిడ్డను కని ఉంటే, అలా మనవడు వచ్చుంటే నేను ఈ పరిస్థితిలో ఉండేదాన్ని కాదు. కానీ, ఏది సవ్యంగా జరగలేదు. అలా జరిగినదాన్ని వదిలించుకునేందుకు కూడా దారి చూపించాను. దీనికి బాధ్యత ఎవరిదీ. లోకం ముందు నేనేందుకు దోషిగా నిలబడాల్సి వచ్చింది అని అపర్ణ అంటుంది. మీరు అబద్ధం చెప్పారని అనుకుంటున్నారు. కానీ, దానివల్ల ఇంటి పరువు నిలబడింది కదా అని కావ్య అంటుంది.

నోర్మూయ్.. అని అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఇంటి పరువు అంటే ఏంటీ. క్షణకాలం చెప్పిన అబద్ధంతో నిలబడిందా. వేసిన ముసుగు వెనుక తల దాచుకునేదా. నువ్ ఏం చెప్పావ్. వాడు నీ బిడ్డ అని ఎలా చెప్పావ్. ఇంటి వారసుడు అని ఎలా అంటావ్. నీకే ఇంట్లో దిక్కు లేదు. నీకే ఇంట్లో విలువ లేదు. అలాంటిది నువ్ ముందుకు వచ్చి ఎందుకు అబద్ధం చెప్పావ్. నేను ఒప్పుకోని ఆ వారసత్వాన్ని ప్రపంచానికి నిజమని ఎలా పరిచయం చేస్తావ్ అని అపర్ణ అంటుంది.

అన్యాయం జరిగింది నాకు

నిజమే.. నాకు ఇంట్లో విలువ లేదు. ఇప్పటికీ కోడలిగా స్థానం లేదు. నాకు ఎలాంటి హక్కులు లేవని మర్చిపోయాను. అసలు నేను మాట్లాడే అర్హత లేదని గుర్తు పెట్టుకోలేకపోయాను. అందుకే నా బిడ్డ అని చెప్పాను. మరి మీరెందుకు నిజం చెప్పలేదు. మీరెందుకు మీ కొడుకు చేసిన పని అందరిముందు బయటపెట్టలేదు. నాకంటే విలువ లేదు. మీరు ఎంతకాదన్న నేను ఆయన భార్యను. ఆయన బిడ్డను తీసుకొస్తే అన్యాయం జరిగింది నాకు అని కావ్య అంటుంది.

ఇంకో స్త్రీతో గడిపి ఓ బిడ్డను తీసుకొస్తే ఏ ఆడది సహిస్తుందండి. ఒక్కరోజైనా నీ భార్య గతేంటి అని మీ కొడుకుని అడిగారా అని కావ్య అంటుంది. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. ఏ ఒక్కరోజైనా మీ కొడుకును మందలించారా. సాటి స్త్రీగా స్పందించారా లేదు. అయినా సరిపెట్టుకున్నాను. సర్దుకుపోయాను. గతిలేక ఇక్కడ ఉంటున్నారంటున్న మహిళ మండలి కుసంస్కారనికి నేను చెప్పే జవాబు కాదిది అని కావ్య అంటుంది. దాంతో అపర్ణ ఏం మాట్లాడలేకపోతుంది.

నిలదీసిన కావ్య

నాకు ఆత్మాభిమానం ఉంటుంది. నా భర్త నాకే స్వంతం అనే నమ్మకం ఉంటుంది. నా ఉనికే ప్రశ్నార్థకంగా మారితే.. నా వ్యక్తిత్వమే నాకు మనో ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే గట్టిగా నిలబడ్డాను. అందరి ముందు అరిచి గొడవ పెట్టలేదు. ఎక్కడి నుంచో వచ్చిన నేనే ఇంత సంయనం వహిస్తుంటే.. మీరు కన్నతల్లివైయిండి మీరేం చేశారు. ఆయన ఇంట్లోనే ఆయన్ను అతిథిని చేశారు. ఆయన ఆఫీస్ నుంచి తప్పించారు. ఇప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్నారు. ఇన్ని చేసిన మీరు ఇప్పుడు నాదే తప్పు అని ఎలా అంటారు అని కావ్య నిలదీస్తుంది.

ఇంత జరిగినా నా భర్త పరువు కాపాడాను. ఇంటి గౌరవాన్ని నిలబెట్టాను. నా అత్తింటి ప్రతిష్టకు భంగం కలగకుండా చేశాను. అది తప్పా. నేరమా. పాపమా అని కావ్య అంటుంది. ఆపు.. చాలు ఆపు. అని అపర్ణ అంటుంది. నువొక త్యాగమూర్తివి. నువ్ చేసింది ఒక త్యాగం. నీ భర్త ఆదర్శపురుషుడు. వాడు చేసింది లోక కల్యాణం. నీకు ఈరోజు నా ముందు మాట్లాడేందుకు నోరు పెగిలిందా. నాదే తప్పని ఎత్తిచూపే సాహసం చేస్తున్నావా. నువ్వెంత.. నీ బతుకెంతా.. నీ స్థాయి ఎంత అని అపర్ణ అరుస్తుంది.

ఆలోచనతో ముందుకు పోవాలి

ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేని కుటుంబం. నీ భర్త మాత్రం సంకరం చేశాడు. శ్రీరామచంద్రుడిలా ఉండాలని నేర్పిస్తే.. వీడెళ్లి సాంప్రదాయాన్ని తొక్కేశాడు. అలాంటివాన్ని క్షమించేంత ఔన్యత్వం నాకు లేదు అని అపర్ణ అంటుంది. ఆవేశపడకు. ఎవరు తప్పు చేశారో. ఒప్పు చేశారో పక్కనపెడితే.. ఈరోజు ఇంటి పరువు పోకుండా బయటపడ్డాం. పరిస్థితులు అలా వచ్చాయి. అందుకే కావ్య, నువ్వు అబద్ధం చెప్పావ్. సమస్య వచ్చినప్పుడు ఆవేశం కంటే ఆలోచనతో ముందుకు పోవాలని ఇందిరాదేవి అంటుంది.

సమస్య నుంచి గట్టెక్కే పరిష్కారాన్ని శోధించాలి అని ఇందిరాదేవి అంటుంది. అందుకు మార్గం ఒక్కటే ఉంది అత్తయ్య. అసలు నేనే తప్పు చేశాను. నువ్ ఆరోజు ఇంటికి బిడ్డను తీసుకొచ్చినరోజే ఇంట్లోంచి గెంటేస్తే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గడపలోపలికి రానిచ్చి తప్పు చేశాను. ఇన్నాళ్లు భరించి ఇంకా పెద్ద తప్పు చేశాను. వారం రోజులు గడువు ఇచ్చాను. ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి అని అపర్ణ అంటుంది.

మర్యాదా ఇవ్వాలా

ఈలోపు నువ్ ఆ బిడ్డ పుట్టుకకు గల కాణం చెబితే సరే సరి. లేకుంటే నిన్ను కన్న కొడుకివని చూడకుండా ఇంట్లోంచి గెంటేస్తాను. ఈ విషయంలో ఎవరైనా అడ్డుపడితే.. నా శవాన్ని చూస్తారు అని ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది అపర్ణ. అంతా షాక్ అయితే.. రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. కట్ చేస్తే.. రుద్రాణి, రాహుల్‌ను మీరు మనుషులేనా అని కావ్య అంటుంది. మర్యాదగా మాట్లాడమని రుద్రాణి అంటుంది. ఇంత చేసిన కూడా మీకు మర్యాదా ఇవ్వాలా. కృతజ్ఞతభావం లేదా అని కావ్య అంటుంది.

మీరు కూడా ఇంటి మనుషులే కదా. ఇంటి పరువు తీస్తే మీ పరువు కూడా పోతుందని తెలీదా అని కావ్య అంటుంది. ఇంతలో వచ్చిన స్వప్న వచ్చి వాళ్లు అలా అనుకుంటే కదా. వీళ్లు గోతికాడా నక్కలు లాంటోళ్లు. అవి చనిపోతేనే పీక్కుతింటాయి. వీళ్లు బతికి ఉండగానే తింటారు అని స్వప్న అంటుంది. నీ చెల్లితో కలిసి ఓవరాక్షన్ చేస్తున్నారు. పెళ్లాంవి పెళ్లాంలా ఉండు అని రాహుల్ అంటాడు. ఏంటీ ఎక్కువ చేస్తున్నారు. నేనే మీడియాను రమ్మన్నాను. తప్పు చేశాను. రాజ్ మాత్రం చేయలేదా అని రుద్రాణి అంటుంది.

అడుగుదూరంలో

వెళ్లి నీ మొగుడుకి చెప్పుకో అని రుద్రాణి అంటే.. సరే మనకెందుకు పంచాయితీ అందరి ముందు చెబుదాం. వాళ్లే డిసైడ్ చేస్తారు. రాజ్‌ను ఇంట్లోంచి పంపిస్తారో. ఆ నిజాన్ని బయట పెట్టాలని చూసిన మీకు ఏ శిక్ష వేస్తారో తెలుస్తుంది అని వెళ్లబోతుంది స్వప్న. కానీ కావ్య ఆపేస్తుంది. మీ భవిష్యత్తును అడుగుదూరంలో ఆపుతున్నాను. వదలమంటారా అని కావ్య అంటుంది. సరే కాంప్రమైజ్‌కు వద్దామని రాహుల్ అంటాడు. సరే సారీ చెప్పమని స్వప్న అంటుంది.

రాహుల్ సారీ చెబుతాడు. మీ అమ్మ చెప్పదా. అలా చూస్తుందేంటీ అని స్వప్న అంటుంది. పెద్దావిడ కదా వదిలేయ్ అక్క అని కావ్య అంటుంది. ఎందుకు పూరీలు తినే మా అత్త సారీ చెప్పాలి అని స్వప్న అంటుంది. మాకు కావాల్సింది ఇది కాదు. మీరు మారడం. అది కష్టమే. చిన్నప్పటినుంచి ఉన్న అలవాటు కదా. కానీ, అలవాటు చేసుకోండి. మీరు బయటకెళ్తే మా అక్క కూడా కష్టపడాల్సి వస్తుందని వదిలేస్తున్నాను అని కావ్య వెళ్లిపోతుంది.

ఇల్లే తగలబడిపోతుంది

మీ చెల్లి కంటే బుద్ధి లేదు. నీకైనా ఉండాలి కదా. మేము రోడ్డున పడితే నువ్ కూడా పడతావ్ కదా అని రాహుల్ అంటాడు. నాకు తాతయ్య ఇచ్చిన ఆస్తితో ఉంటాను. నేనేందుకు రోడ్డున పడతాను అని స్వప్న వెళ్లిపోతుంది. దీని దగ్గర ఆస్తి కొట్టేయడంలో ఏ తప్పు లేదని రాహుల్ అంటాడు. నన్నే ఇంత అవమానిస్తారా. ఇప్పుడు నేను ఊరుకుంటే రుద్రాణిని ఎలా అవుతాను. ఇప్పుడు నేను అంటించే మంటకు ఈ ఇల్లే తగలబడిపోతుందో చూడు అని రుద్రాణి పగతో రగిలిపోతుంది.

మమ్మీకి ఇంత కోపం వచ్చిందంటే ఎవరికో తగలబడిపోయేలా ఉంది అని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు తనను కొట్టింది తలుచుకుంటూ అనామిక బాధపడుతుంది. అది చూసి రుద్రాణి .. కావ్య నన్నే అవమానించావ్ కదా. దీన్ని వాడుకుని నీ చెల్లిని ఏం చేస్తానో అని అనుకుంటుంది. చేయాల్సింది చేయకుండా ఇలా ఏడిస్తే ఏమస్తుంది. ఆ అప్పు ముందు నిన్ను కల్యాణ్ కొట్టాడు. దానికి కారణైన అప్పును ఏం చేయకుండా ఉంటే నేను ఏం చేస్తాను అని రుద్రాణి అంటుంది.

మానం పోతే అన్నిపోయినట్లే

తనను చంపేయాలన్నంత కోపం వచ్చింది. మరి ఆ పని చేయకుండా ఏంటీ అని రుద్రాణి అంటుంది. అంటే అప్పును చంపేయమంటారా అని అనామిక అంటుంది. చంపేయాలన్నంత కోపం వస్తే.. చంపేయమని కాదు. వాళ్ల మానం మీద కొట్టాలి. అదే వాళ్లకు చావు దెబ్బతో సమానం. డబ్బున్న వాళ్లకు మోసం తప్పా మానం ఉండదు. కానీ, మధ్యతరగతి వాళ్లకు మానం పోతే అన్ని పోయినట్లే అనుకుంటారు అని రుద్రాణి అంటుంది.

అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేయాలి. ఆ అప్పు మానం పోవాలి. ఇలాగే ఏడుస్తూ కూర్చోవాలి అని అనామిక అంటుంది. శభాష్ ఇప్పుడు నేను చెప్పినట్లు చేయి అని రుద్రాణి ఏదో చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కనకం ఇంటికి పోలీసులు వస్తారు. మీ అప్పును అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పగానే షాక్ అవుతారు. పోలీసులు అప్పును తీసుకెళ్లిపోతారు.

గృహ హింస కేసు

మరోవైపు ఏం జరిగింది కల్యాణ్ అని ధాన్యలక్ష్మీ అడిగితే.. చెంప పగులగొట్టాను అని కల్యాణ్ చెబుతాడు. పోలీసులతో ఎంట్రీ ఇచ్చిన అనామిక చూశారా ఎంత ధైర్యంగా చెబుతున్నాడో. ఈ డొమెస్టిక్ వయెలెన్స్ నేను భరించలేను. కేసు పెట్టండి అని పోలీసులతో అంటుంది అనామిక. దాంతో అంతా షాక్ అవుతారు. రుజువు కాకముందు కేసు దాకా వెళ్లకండి అని రాజ్ అంటే.. మీరు ఇప్పుడు కేసు తీసుకోకపోతే నేను మీ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తాను అని అనామిక అంటుంది. అంతా అవాక్కై చూస్తారు.