Rajiv Chilaka About Actor Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించారు. ముఖ్యంగా ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరెకెక్కిన సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్ గురించి నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యానిమేషన్ రంగంలో చాలా కాలంగా ఉన్నారు. సినిమా రంగంలోకి రావడానికి ఇంత కాలం ఎందుకు పట్టింది?

యానిమేషన్ రంగం చాలా కష్టంతో కూడుకున్నది. ముందు కంపెనీని సుస్థిరం చేసే దిశగా పని చేశాం. మా దగ్గర దాదాపు ఎనిమిది వందల మంది ఉద్యోగులు పని చేస్తారు. వారందరికీ జీతాలు ఇవ్వడం మామూలు విషయం కాదు. అయితే సినిమాలు చేయాలని ఎప్పటినుంచో వుంది. దాదాపు ఆరు యానిమేషన్ చిత్రాలు చేశాం. కంపెనీ స్థిరపడిన తర్వాత సినిమాల్లోకి రావాలని భావించాం. ఈ క్రమంలో కొంత సమయం పట్టింది. ఇకపై వరుసగా సినిమాలని నిర్మిస్తాం.

ఈ కథ విన్నాకా మొదట నరేష్ గారినే అనుకున్నారా?

“ఫస్ట్ అల్లరి నరేష్ (Allari Naresh) గారినే అనుకున్నాం. ఈ కథ విన్నాక మొదట మైండ్‌లోకి వచ్చిన రాజేంద్రప్రసాద్ (Actor Rajendra Prasad) గారు. యంగ్‌గా ఉంటే ఆయన పర్ఫెక్ట్. ఇప్పుడైతే ఈ కథ నరేష్ గారికే యాప్ట్. నరేష్ గారికి ఈ కథ చాలా నచ్చింది. మేము కథ చెప్పినపుడు ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కోసం వెయిట్ చేసి తీశాం” అని రాజేంద్ర ప్రసాద్ ఏజ్ దృష్ట్యా తీసుకోలేదని నిర్మాత తెలిపారు.

‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ గురించి ?

కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ, సరిగ్గా సెట్ కాలేదు. అలాంటి సమయంలో నరేష్ గారే ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ సూచించారు. నిజానికి ఈ కథకు యాప్ట్ టైటిల్ ఇది. ఇందులో హీరోని అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటారు. దీంతో ఇరిటేషన్‌లో హీరో పలికే సహజమైన డైలాగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ టైటిల్ పెట్టడం పెద్ద బాధ్యత. నరేష్ నాన్నగారి క్లాసిక్ సినిమా అది. నరేష్ గారికి ఇంకా భాద్యత ఉంది. కథ, అవుట్ పుట్ అన్నీ చూసుకున్నాక సినిమా టైటిల్ డిసైడ్ చేయమని కోరాం. నరేష్ గారు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలై టైటిల్ వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు.

ఈ కథలో ట్విస్ట్‌లు ఉన్నాయా ?

ఇందులో కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్‌లు ఉన్నాయి. స్క్రీన్ ప్లే కథలో లీనం చేస్తుంది. ఆద్యంతం ప్రేక్షకులని హోల్డ్ చేస్తుంది.

దర్శకుడిగా మల్లి అంకంను ఎంపిక చేయడానికి కారణం?

తను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. దాదాపు ఇరవై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నారు. నాకు ముందు నుంచి పరిచయం ఉంది. తను అనుకున్న కథని చాలా అద్భుతంగా తీశాడు.