Jeans Movie OTT: డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకునే తమిళ దర్శకుడు శంకర్ తీసిన మూవీ జీన్స్. 1998, ఏప్రిల్ 24న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ మధ్యే 26 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మూవీలో ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ అప్పట్లో పెద్ద సంచలనం. తన కవల పిల్లలకు కవలలనే ఇచ్చి చేస్తాననే ఓ తండ్రి మొండి పట్టుదల ఎక్కడికి దారి తీసిందన్న భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది.

జీన్స్ మూవీ ఎందుకంత హిట్ అయిందంటే?

1998లో వచ్చిన జీన్స్ మూవీ ఓ భిన్నమైన అనుభూతిని అందించింది. ప్రశాంత్, ఐశ్వర్య నటన.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ మూవీని పెద్ద హిట్ గా మార్చాయి. ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకునే డైరెక్టర్ శంకర్.. ఈ జీన్స్ తోనూ అదే చేశాడు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ను బాగా ఇష్టపడే అతడు.. 26 ఏళ్ల కిందట ఈ సినిమా కోసం చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలోని అతిశయం పాట అప్పట్లో ఓ పెను సంచలనం. ఈ పాటను అప్పటి ప్రపంచంలోని ఏడు వింతల దగ్గర షూట్ చేయడం విశేషం. తాజ్ మహల్ తోపాటు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఈజిప్ట్ పిరమిడ్స్, కొలోజియం, ఐఫిల్ టవర్ ల దగ్గర ఈ పాటను షూట్ చేశారు. జీన్స్ మూవీలో ఈ సాంగ్ హైలైట్ అని చెప్పొచ్చు.

ఇక జీన్స్ కోసం ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఈ అతిశయం పాటతోపాటు కొలంబస్ కొలంబస్, హాయిరబ్బా, కన్నులతో చూసేవిలాంటి సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మ్యూజిక్ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఐశ్వర్య రాయ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రత్యేకమైన ప్రేమకథ

జీన్స్ ఓ లవ్ స్టోరీయే అయినా అది ప్రత్యేకంగా నిలిచింది. తన కవల కొడుకులకు కవలలైన ఆడ పిల్లలనే ఇచ్చి పెళ్లి చేస్తానని పంతం పట్టే తండ్రి.. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం తన ప్రేయసికి లేని కవలను క్రియేట్ చేసే ప్రియుడి తపన ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసింది. ఇలాంటి స్టోరీని ఎంచుకోవడంతోపాటు దానిని ఆకట్టుకునేలా చెప్పగలగడంతోనే శంకర్ విజయం సాధించాడు.

ఈ జీన్స్ తమిళంతోపాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. అప్పటికే జెంటిల్మన్, ప్రేమికుడు, భారతీయుడులాంటి సినిమాలను అందించిన శంకర్.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

జీన్స్ ఓటీటీ

జీన్స్ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఈ మూవీని ఆహా ఓటీటీతోపాటు సన్ నెక్ట్స్ లోనూ చూడొచ్చు. అంతేకాదు యూట్యూబ్ లోనూ ఈ సినిమా అన్ని భాషల వెర్షన్లు ఉన్నాయి. ఒక్కసారి రెండున్నర దశాబ్దాలు వెనక్కి వెళ్లి ఈ జీన్స్ మూవీ చేసిన మాయను మరోసారి చూడొచ్చు.