posted on Apr 26, 2024 4:36PM

 వల్లభనేని వంశీ  నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.  అలా చెప్పేస్తూనే ఏదో ఓ మేరకు సానుభూతి ఓట్లను రాబట్టుకోవడానికి చివరి ప్రయత్నం కూడా చేశారు. గన్నవరం నుంచి ఇక తాను పోటీ చేయనని చెప్పిన వల్లభనేని వంశీ.. వచ్చే ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి దుట్టారామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారనీ, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు.

ఇదంతా ఆయన ఎన్నికల నిమినేషన్ ర్యాలీ వెలవెలబోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ వంశీ పలికిన పలుకులు.  దుట్టారామచంద్రరావు కుమార్తెకు వచ్చే ఎన్నికలలో మద్దతు ఇస్తానంటూ వంశీ చెప్పడం వెనుక ఈ ఎన్నికలో దుట్టా వర్గం కనీసం ఇప్పటికైనా తనకు మద్దతుగా చురుగ్గా పని చేస్తుందన్న చివరి ఆశ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీలో వంశీకి మద్దతు కరవైంది. తెలుగుదేశం పార్టీలో ఉండగా వంశీ అనుచరులుగా ఉన్నవారిలో 90 శాతం మందికి పైగా ఆయన తెలుగుదేశం వీడగానే ఆయనకు దూరం అయ్యారు. ఇక వైసీపీ నుంచి తెలుగుదేశం గూటికి చేరి గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వెంట ఆయన అనుచరవర్గమంతా టీడీపీ పంచన చేరిపోయింది. ఇక నియోజకవర్గంలో బలమైన దుట్టా రామచంద్రరావు వంశీకి మద్దతుగా పని చేయడానికి ససేమిరా అంటున్నారు.  ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి వంశీ చేసినదేమీలేదన్న ఆగ్రహం నియోజకవర్గ ప్రజలలో బలంగా కనిపిస్తోంది.  

అది వంశీ నామినేషన్ ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. తీసుకువచ్చిన కూలి జనం కూడా మధ్యలోనే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారు. అదే తెలుగుదేశం అభ్యర్థిగా యార్లగడ్డ నామినేషన్ ర్యాలీ కళకళలాడింది. భారీ జనసందోహంతో  జైజై ధ్వానాలతో ఆ ర్యాలీ సాగింది. జనం స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో  వంశీకి పరిస్థితి అర్ధమైంది.  దుట్టాను శరణుజొచ్చారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయను.. మీ కుమార్తెకే మద్దతు ఇస్తానంటూ బతిమలాడుతున్నారు. అయితే ఇప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దుట్టా మెత్తబడినా ఆయన వర్గం మాత్రం వంశీకోసం పని చేసే పరిస్థితి లేదని సోదాహరణంగా వివరిస్తున్నారు.  మొత్తం మీద వంశీకి గెలుపుపై దింపుడు కళ్లెం ఆశకూడా మిగలలేదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.