posted on Apr 26, 2024 1:52PM

ఏంటమ్మా జగనూ… మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే.. నువ్వు చెల్లికి అప్పు ఇచ్చినట్టు వుంది.. కానీ, అది అప్పు కాదని, తనకు ఆస్తిలో వాటాగా రావలసిన చాలా డబ్బులో కొంత డబ్బుని ‘అప్పు’ రూపంలో ఇచ్చావంటా? ఈ విషయం మాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకు.. చెల్లెమ్మ చేతికి మైకు ఇస్తే చాలు ముందుగా తనకు రావలసిన తన ఆస్తి గురించే మాట్లాడుతోంది మరి. ఆమె అలా రోడ్డు మీదకి వచ్చి తన ఆస్తి గురించి లబోదిబో అంటోంది కాబట్టి, ఇష్యూ పబ్లిక్‌లోకి వచ్చేసింది కాబట్టి మీ కుటుంబ ఆస్తి వివరాల గురించి మాట్లాడే అవకాశం అందరికీ మీరే ఇచ్చినట్టు అయింది.

ఆ మహానేత, నాన్నగారు పోయిన తర్వాత ఆయన ‘కష్టపడి’ సంపాదించిన మొత్తం అన్నాచెల్లెళ్ళు మీరిద్దరూ పంచుకోవాలి కదా.. ఆయన కీర్తిశేషుడై చాలా సంవత్సరాలైంది. ఇంతవరకు ఆస్తుల పెంపకం ప్రస్తావన తేకుండా మొత్తం నీ దగ్గరే వుంచేసుకుంటే ఎలా జగన్ బ్రో? పాపం ఆయన ఊహించని విధంగా అకస్మాత్తుగా చనిపోయారు. ఒకవేళ ఆయనే బతికుంటే, చక్కగా ఆస్తిమొత్తాన్నీ ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చి వుండేవారు కదా? తండ్రి తర్వాత తండ్రి లాంటి నువ్వు పాపం నీ చెల్లికి తండ్రి లేని లోటు తీర్చి ఆస్తి పంచి ఇస్తే ఇప్పుడు పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా.

ఆస్తి వస్తుంది, పోతుంది.. ఆత్మీయతలు, అనురాగాలు పోతే తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అందుకని ఒక్కగానొక్క చెల్లిని ఏడిపించకుండా ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి ఆమెకి ఇస్తే మీ అనురాగాలు కొనసాగుతాయి.. అంతేకాదు.. పైన వున్న మీ నాన్న వైఎస్సార్, తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకా కూడా చాలా సంతోషిస్తారు. అయినా అంత డబ్బు ఏం చేసుకుంటావ్ జగన్? మీ తాత, మీ నాన్న అంత సంపాదించి ఏం చేసుకున్నారు? ఒక్క రూపాయి అయినా తీసుకెళ్ళారా? ఎవరైనా అంతే, మొన్న కంటికి పైన తగిలిన రాయి ఏ కణతకో తగిలి వుంటే పరిస్థితి ఏమయ్యేది? అందుకని, ఇప్పటి వరకు అయిన రచ్చ చాలు.. ఇక ఈ రచ్చకి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన బాధ్యత నీదే.