Liver Health: యువత అధికంగా ఇష్టపడే డ్రింకుల్లో శీతల పానీయాలు మొదటి స్థానంలో ఉంటాయి. ప్రతిరోజూ కూల్ డ్రింకులను తాగే వారి సంఖ్య ఎక్కువే. రోజుకు ఒక శీతల పానీయం తాగితే కాలేయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చెబుతున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ ఒక కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉన్నవారికి దీర్ఘకాలికంగా కాలేయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఒక డ్రింకులో ఎంత చక్కెర?

మార్కెట్లో లభించే శీతల పానీయాలలో అధిక స్థాయిలో చక్కెర ఉంటుంది. ఒక్క కూల్ డ్రింకులో 50 నుండి 80 గ్రాముల చక్కెర ఉండవచ్చు. అంటే మీరు ఒక కూల్ డ్రింక్ తాగితే అది 10 నుంచి 15 స్పూన్ల చక్కెర తినడంతో సమానం. ఇంత చక్కెర శరీరంలో చేరడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమైపోతుంది. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే చక్కెర విచ్ఛిన్నం ఎక్కువైపోయి… అధిక కార్బోహైడ్రేట్లు కాలేయంలో చేరి కొవ్వుగా మారుతాయి. కాలేయంలో కొవ్వు నిల్వలు పేరుకు పోవడానికి దారితీస్తాయి. దీనివల్ల తీవ్రమైన అలసట రావడంతో పాటు కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

కూల్ డ్రింకులో షుగర్‌లో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో పాటు కార్న్ సిరప్, స్వీటింగ్ ఏజెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కాలేయ ఆరోగ్యానికి ముప్పును తెచ్చి పెడతాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల తీవ్రమైన కాలేయ వ్యాధులు రావచ్చు. ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, స్లీప్ అప్నియా, హైపర్ డైస్లిపిడేమియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

కాలేయ ఆరోగ్యానికి

కాలేయంలో కొవ్వు పేరుకుపోతే జీవక్రియ సక్రమంగా జరగదు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులు రావచ్చు. శీతల పానీయాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తినడం… కాలేయ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల కలిగే సమస్యలన్నీ ఈ కూల్ డ్రింకులు తాగడం వల్ల వస్తాయి. కాబట్టి రోజుకొక కూల్ డ్రింక్ తాగడం అలవాటుగా చేసుకోవద్దు. ఎంత త్వరగా మీరు కూల్ డ్రింక్ తాగే అలవాటును వదిలేస్తారో.. మీ కాలేయం మళ్లీ అంత ఆరోగ్యంగా మారుతుంది.