Dharmasagar Reservoir : గ్రేటర్ వరంగల్ నగరానికి తాగునీటి తిప్పలు తప్పేలా లేవు! ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతుండటం కలవరపెడుతుండగా.. దేవాదుల పంపింగ్ నిలిచిపోవడం సమస్యగా మారింది. ఫలితంగా వరంగల్ ట్రై సిటీకి ప్రధాన తాగునీటి వనరు అయిన ధర్మసాగర్ రిజర్వాయర్(Dharmasagar Reservoir) నీటిమట్టం పడిపోతోంది. అందుకే నగర ప్రజలకు రోజువారీగా సప్లై చేయాల్సిన నీటిని రెండు, మూడు రోజులకోసారి విడుదల చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండగా.. నీటిని పొదుపుగా వాడుకోకపోతే బెంగళూరు దుస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదు.

నిలిచిన దేవాదుల పంపింగ్​

వరంగల్ ట్రై సిటీకి ధర్మసాగర్ రిజర్వాయర్ తో పాటు కరీంనగర్ ఎల్ఎండీ నుంచి నీటిని సరఫరా చేస్తుంటారు. లోయర్ మానేర్ డ్యాం నుంచి ప్రతి రోజు 60 ఎంఎల్డీ(మిలియన్ లీటర్ పర్ డే) తీసుకుంటున్న అధికారులు ధర్మసాగర్ లోని ప్లాంట్ వద్ద ట్రీట్మెంట్ చేసి, వరంగల్ నగరంలోని అండర్ రైల్వే జోన్ గా పిలిచే ప్రాంతాలకు సప్లై చేస్తుంటారు. కాగా గ్రేటర్ వరంగల్ కు నీటిని సరఫరా చేయడంతో ధర్మసాగర్ రిజర్వాయర్ దే అగ్ర భాగం కాగా.. ఇక్కడికి గోదావరి నుంచి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగడం, కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన లోపాల కారణంగా ఆ దిగువన ఉన్న దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్ నిలిపేశారు. దాదాపు 20 రోజుల కిందటే పంపింగ్ ఆపేయగా, రోజువారీ వాడకం, మండుతున్న వేసవి, భూగర్భజలాలు అడుగంటుతున్న కారణంగా ధర్మసాగర్ రిజర్వాయర్ లో నీటి మట్టం తగ్గుతూ వస్తోంది.

సగానికిపైగా డౌన్​

ధర్మసాగర్​ రిజర్వాయర్ ఫుల్ లెవల్ కెపాసిటీ 1.5 టీఎంసీలు కాగా.. సాధారణంగా 1.2 టీఎంసీల వరకు నీటిని స్టోర్ చేస్తుంటారు. ఆ తరువాత ఇక్కడి నుంచి నీటిని వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ, దేశాయిపేటలోని మూడు ఫిల్టర్ బెడ్ లకు సరఫరా చేస్తుంటారు. అక్కడి నుంచి వరంగల్ ట్రై సిటీకి వాటర్ సప్లై అవుతుంటుంది. ఇలా రోజువారీగా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి 172 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నగరానికి సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ రిజర్వాయర్ నీటి మట్టం చాలావరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రిజర్వాయర్ లో 0.6 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు కూడా లేకపోవడం కలవరానికి గురి చేస్తోంది. ఇదిలాఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో వరంగల్ నగరానికి దాదాపు మూడు నెలలపాటు తాగునీటిని అందించే అవకాశం ఉందని అక్కడి సిబ్బంది చెబుతుండటం గమనార్హం.

రెండు, మూడు రోజులకోసారి సరఫరా

దేవాదుల పంపింగ్ నిలిచిపోవడంతో ధర్మసాగర్ రిజర్వాయర్ అడుగంటుతుండటం సమస్యగా మారింది. దీంతో వరంగల్ నగరంలోని కాలనీలకు వంతులవారీగా రెండు, మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి వరంగల్ లో ఒక్కో వ్యక్తికి 100 లీటర్ల చొప్పున ప్రతి రోజు సరఫరా చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 ఏప్రిల్ లో జరిగిన జీడబ్ల్యూఎంసీ ఎన్నికల ముందే మిషన్ భగీరథ పథకంలో భాగంగా నగరంలో డైలీ వాటర్ సప్లై సిస్టంను కూడా ప్రారంభించారు. నిన్నమొన్నటి వరకు అలాగే నీటి సరఫరా జరిగినా.. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. చాలా ప్రాంతాలకు రెండు, మూడు రోజులకోసారి నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఇదిలాఉంటే ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నార్త్ మెన్ కెనాల్ ద్వారా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ధర్మసాగర్ రిజర్వాయర్(Dharmasagar) నుంచి చివరి తడికి నీళ్లు అందక కొన్ని చోట్ల పంటలు కూడా ఎండిపోయాయి. ఇదిలాఉంటే ఇప్పటికే బెంగళూరులాంటి మహానగరాలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా.. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథాను అరికట్టాలని ఇక్కడి అధికారులు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్ – హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)