ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ ను చెక్ చేయాలనుకుంటే అందుకు వివిధ మార్గాలున్నాయి. ఉమాంగ్ యాప్ ద్వారా లేక ఆన్ లైన్ లో ఈపీఎఫ్ పోర్టల్ ద్వారా లేదా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ అకౌంట్ వివరాలను తెలుసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ నంబర్ నుంచి 7738299899 కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా వివరాలను పొందవచ్చు.

డీఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్

ఈపీఎఫ్ సాధారణంగా ఇంగ్లీష్ లోనే అకౌంట్ బ్యాలెన్స్ తదితర వివరాలను పంపిస్తుంది. మీరు ఎస్ఎంఎస్ పంపినప్పుడు, వివరాలు ప్రాంతీయ భాషలో కావాలని ప్రత్యేకంగా కోరితే తప్ప ఇంగ్లీష్ లోనే వివరాలను పంపిస్తారు. ఒకవేళ తెలుగు, తమిళం, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో మీకు ఆ వివరాలు కావాలనుకుంటే, ఆ విషయాన్ని ఎస్ఎంఎస్ పంపిన సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది.

9 ప్రాంతీయ భాషల్లో..

ఇప్పుడు ఈపీఎఫ్ఓ తెలుగు సహా మొత్తం 9 ప్రాంతీయ భాషల్లో ఈపీఎఫ్ ఖాతా వివరాలను పంపిస్తుంది. అవి హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ. ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ ఖాతా సమాచారం పొందడానికి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలి. అక్కడ UAN స్థానంలో ఈపీఎఫ్ చందాదారు తన UAN నంబర్ ను టైప్ చేయాలి. ఇలా ఎస్ఎంఎస్ పంపినప్పుడు, ఈపీఎఫ్ ఖాతా వివరాలు ఇంగ్లీష్ లో వస్తాయి.

తెలుగు భాషలో పొందాలంటే..

కానీ, ఒకవేళ తెలుగు లేదా వేరే ఏదైనా ప్రాంతీయ భాషలో వివరాలు కావాలనుకుంటే ఎలా ఎస్ఎంఎస్ పంపించాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం లాంగ్వేజ్ కోడ్ తెలుసుకోవాలి. మెసేజ్ తర్వాత స్పేస్ వదిలిన తర్వాత ఈ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు తెలుగులో సమాచారం పొందాలంటే లాంగ్వేజ్ కోడ్ గా TEL ను పంపాలి. అంటే, మీకు తెలుగులో ఈపీఎఫ్ ఖాతా సమాచారం కావాలనుకుంటే.. మీ ఎస్ఎంఎస్ ను EPFOHO UAN TEL అనే ఫార్మాట్ లో 7738299899 నంబర్ కు పంపించాలి. ఇక్కడ కూడా UAN అని ఉన్న చోట ఈపీఎఫ్ చందాదారు తన UAN నంబర్ ను టైప్ చేయాలి. ఆ ఫార్మాట్ లో ఎస్ఎంఎస్ పంపిస్తే, ఈపీఎఫ్ ఖాతా వివరాలు తెలుగులో అందుతాయి.

ఇతర భాషల్లో పొందాలంటే..

ఇతర ప్రాంతీయ భాషల్లో ఈపీఎఫ్ వివరాలను పొందాలంటే ఈ లాంగ్వేజ్ కోడ్ లను ఉపయోగించాలి. హిందీకి HIN, పంజాబీకి PUN, గుజరాతీకి GUJ, మరాఠీకి MAR, కన్నడకు KAN, తమిళ్ కు TAM, మలయాళం కోసం MAL, బెంగాలీకి BEN కోడ్ ను ఉపయోగించాలి. ఈ సందేశం అందిన తరువాత చివరి ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్, చందాదారుల బ్యాలెన్స్ వివరాలతో పాటు అందుబాటులో ఉన్న కేవైసీ సమాచారాన్ని పంపుతుంది.

మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా..

మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ వివరాలను పొందవచ్చు. మిస్డ్ కాల్ ద్వారా ఖాతా వివరాలను పొందడానికి, చందాదారుడు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్ కు మిస్ట్ కాల్ చేయాలి.అయితే, ఆ నంబర్ యూనిఫైడ్ పోర్టల్ లో యూఏఎన్ తో యాక్టివేట్ అయి ఉండాలి.