posted on Apr 25, 2024 4:23PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.  తాజాగా జగన్  వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులలో ఒకడైన అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లోడు’ అంటూ సంబోధించి మరోసారి నెటిజనులకు అడ్డంగా దొరికి పోయారు.

గురువారం (ఏప్రిల్ 24) పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సభలో ఆయన అవినాష్ రెడ్డిని ‘చిన్న పిల్లోడు’ అని పేర్కొన్నారు. ఈ చిన్నపిల్లోడి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు.

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుల్లో అవినాష్ రెడ్డి ఒకరు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఆయన బెయిలు రద్దు పిటిషన్ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో కడప లోక్ సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని  చిన్నపిల్లోడిగా అభివర్ణిస్తూ జగన్ ఆ ఆరోపణలను తుడిచేసే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదు కనుకనే ఆయనకు కడప లోక్ సభ టికెట్ ఇచ్చినట్లు చెప్పారు. 

అయినా అవినాష్ రెడ్డి అమాయకత్వం గురించి జగన్ కు స్వయానా మేనమావ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గతంలోనే బాహాటంగా చెప్పేశారు. వివేకా మృతదేహానికి కుట్టు వేస్తుంటే అవినాష్ రెడ్డి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ నిలబడిపోయారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అదికూడా కమలాపురంలో ఓ బహిరంగ సభలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకునే ఆ మాట చెప్పారు.  ఇప్పుడు జగన్ కూడా అదే చెబుతున్నారు.

అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అతడికి ఏమీ తెలియదు అంటున్నారు.  వివేకా హత్య కేసులో అవినాష్  నిందితుడని అనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ తేల్చి చెప్పింది. కోర్టులూ అదే చెబుతున్నాయి. అయినా జగన్ అవినాష్ రెడ్డిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయి.