Zara Hatke Zara Bachke OTT: బాలీవుడ్ యంగ్ స్టార్ విక్కీ కౌశల్, సారా అలీఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘జర హట్కే జర బచ్కే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా పర్ఫార్మ్ చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 2023 జూన్‍లో రిలీజ్ అయింది. సుమారు రూ.115 కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‍గా నిలిచింది. మిక్స్డ్ టాక్ వచ్చినా.. కమర్షియల్‍గా మాత్రం ఈ మూవీ సక్సెస్ సాధించింది. అయితే, థియేటర్లలో రిలీజై ఇంతకాలమైనా ఈ జర హట్కే జర బచ్కే చిత్రం ఇంకా ఓటీటీలోకి రాలేదు. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే..

జర హట్కే జర బచ్కే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వేచిచూస్తున్న వారి నిరీక్షణ త్వరలోనే తీరనుంది. ఈ మూవీ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే నెలలో స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో థియేటర్లలో రిలీజైన 11 నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెడుతోంది.

జర హట్కే జర బచ్కే మూవీ మేలో జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రావడం దాదాపు ఖరారైంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍ను ఆ ప్లాట్‍ఫామ్ ప్రకటిస్తుందని తెలుస్తోంది. అందులోనూ ప్రస్తుతం జియోసినిమా ఓటీటీలో ఐపీఎల్ ఫీవర్ ఉండటంతో ఈ సమయంలో ఈ సూపర్ హిట్ మూవీని తీసుకొస్తే ఈ చిత్రానికి వ్యూవర్‌షిప్ మరింత పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, జర హట్కే జర బచ్కే చిత్రాన్ని ప్రీమియమ్ సబ్‍స్క్రైబర్లకే జియోసినిమా అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్లాట్‍ఫామ్ తాజాగా రూ.29, రూ.89 నెలవారి ప్రీమియమ్ సబ్‍స్క్రిప్షన్ ప్లాన్‍లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‍లు తీసుకుంటే యాడ్స్ లేకుండానే మూవీస్ చూడొచ్చు.

కలెక్షన్లు ఇలా..

జర హట్కే జర బచ్కే సినిమాకు లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై దినేశ్ విజన్, జ్యోతీ దేశ్‍పాండే ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి సుమారు రూ.40కోట్ల బడ్జెట్ అవగా.. రూ.115 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గానే నిలిచింది ఈ మూవీ.

జర హట్కే జర బచ్కే సినిమాలో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్‍తో పాటు ఇనాముల్‍హక్, సుష్మిత ముఖర్జీ, నీరజ్ సూద్, రాకేశ్ బేడీ. షారిబ్ హష్మి, ఆకాశ్ ఖురానా, కనుప్రియ పండిట్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సందీప్ శిరోద్కర్, సచిన్ – జిగార్ సంగీతం అందించారు.

జియోసినిమా కొత్త ప్లాన్‍లు

జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ కొత్తగా రెండు ప్లాన్‍లను తీసుకొచ్చింది. ప్లాట్‍ఫామ్‍లోని ప్రీమియమ్ కంటెంట్ కూడా చూసే సదుపాయంతో ఈ ప్లాన్‍లను ప్రవేశపెట్టింది. నెలకు కేవలం రూ.29, రూ.89 ప్లాన్‍లను తెచ్చింది. రూ.29 ప్లాన్ తీసుకుంటే ఒకే డివైజ్‍లో చూడొచ్చు. అదే ఫ్యామిలీ పేరుతో తీసుకొచ్చిన రూ.89 సబ్‍స్కిప్షన్ ప్లాన్ తీసుకుంటే 4 డివైజ్‍ల్లో వరకు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‍లు తీసుకుంటే జియో సినిమాలో ప్రీమియమ్ కంటెంట్‍ను చూడడంతో పాటు యాడ్స్ కూడా రావు. ఒకవేళ ఏ ప్లాన్ తీసుకోకపోయినా ఐపీఎల్ లైవ్ మ్యాచ్‍లు సహా ఫ్రీ కంటెంట్‍ను జియోసినిమాలో ఉచితంగా చూడవచ్చు.