రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర గురువారం ప్రారంభ ట్రేడింగ్ లోనే 10 శాతం క్షీణించింది. బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర 10 శాతం క్షీణించి రూ.1,658.75 వద్ద ముగిసింది.

ఆర్బీఐ ఆంక్షలు

ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్తగా క్రెడిట్ కార్డులను జారీ చేయడం తక్షణమే నిలిపివేయాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ ను బుధవారం ఆర్బీఐ ఆదేశించింది. 2022, 2023 సంవత్సరాల్లో బ్యాంక్ ఐటీ వ్యవస్థలో గణనీయమైన లోపాలున్నాయని ఆరోపిస్తూ ఆర్బీఐ కొటక్ మహీంద్ర బ్యాంక్ పై ఈ ఆంక్షలు జారీ చేసింది.

బ్యాంక్ సాధారణ కార్యకలాపాలు కొనసాగుతాయి

కొటక్ మహింద్ర బ్యాంక్ ప్రస్తుత కస్టమర్లు ఆర్బీఐ తాజా ఉత్తర్వులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులకు వారి వారి ఖాతాలలోని డబ్బు సురక్షితంగానే ఉంటుంది. వారు తమ క్రెడిట్ కార్డు కార్యకలాపాలను కూడా కొనసాగించవచ్చు.

ఆర్బీఐ ప్రకటన

కొటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) పై విధించిన ఆంక్షలను వివరిస్తూ ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ‘‘బ్యాంక్ తన క్రెడిట్ కార్డు కస్టమర్లతో సహా ప్రస్తుత కస్టమర్లకు సేవలను అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొంది. కొటక్ బ్యాంక్ ఐటీ ఇన్వెంటరీ మేనేజ్ మెంట్, ప్యాచ్ అండ్ చేంజ్ మేనేజ్ మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్ మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్ మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ.. తదితర వ్యవస్థల్లో తీవ్రమైన లోపాలను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. సంబంధిత ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని వెల్లడించింది.

కొటక్ బ్యాంక్ స్పందన

ఆర్బీఐ ఆంక్షలపై కోటక్ మహీంద్ర బ్యాంక్ (Kotak Bank) స్పందించింది. “బ్యాంక్ ఐటీ వ్యవస్థలను నూతన సాంకేతికతతో బలోపేతం చేస్తామని, బ్యాలెన్స్ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ఆర్బిఐతో కలిసి పనిచేస్తామని వెల్లడించింది. క్రెడిట్ కార్డు, మొబైల్, నెట్ బ్యాంకింగ్ తో సహా అంతరాయం లేని సేవల గురించి బ్యాంక్ తన ప్రస్తుత కస్టమర్లకు భరోసా ఇస్తోంది” అని కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీ మినహా బ్యాంకుకు సంబంధించిన అన్ని సేవలు కొనసాగుతాయని తెలిపింది.

బ్యాంక్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం

ఆర్బీఐ ఆంక్షలు కోటక్ మహీంద్రా బ్యాంక్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ సంతృప్తి చెందేలా బ్యాంక్ ఎక్స్ టర్నల్ ఆడిట్, దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళిక పూర్తి కావడానికి కనీసం 6 నుంచి 12 నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆర్బీఐ పేర్కొన్న సమస్యల పరిష్కారానికి ఆరు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, అది బ్యాంక్ ఆదాయాలు, ఖర్చులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లపై పలు బ్రోకరేజీ సంస్థలు ‘హోల్డ్’ పిలుపునిచ్చాయి.

డిజిటల్ సర్వీసెస్

డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ 95% కొత్త వ్యక్తిగత రుణాలు, 99% కొత్త క్రెడిట్ కార్డులను డిజిటల్ రూపంలో పంపిణీ చేసింది. అంతేకాకుండా, 90% కొత్త పెట్టుబడులు, 76% ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ ఖాతాలను డిజిటల్ విధానంలోనే తెరిచారు. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పోర్ట్ ఫోలియో అడ్వాన్స్ లలో 3.7% ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) పరిష్కారానికి ఆరు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, అది రుణదాత ఆదాయాలు మరియు ఖర్చులపై ప్రభావం చూపుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లపై బ్రోకరేజీ సంస్థ ‘హోల్డ్’ పిలుపునిచ్చింది.