Balakrishna: ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో గ‌త రెండు ద‌శాబ్దాలుగా టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు ఏఆర్ రెహ‌మాన్‌. త‌న మ్యూజిక్‌తో ఇండియ‌న్ సినిమా ఖ్యాతిని ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్తాడు. స్టార్ హీరోల స్థాయిక‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకునే ఏకైక మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రెహ‌మాన్ నిలిచాడు. రెహ‌మాన్ మ్యూజిక్‌కు తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కువ‌గా త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల ద్వారానే రెహ‌మాన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు.

తెలుగులో ప‌దిలోపే…

తెలుగులో రెహ‌మాన్ మ్యూజిక్ అందించిన‌స్ట్రెయిట్ సినిమాల సంఖ్య ప‌దిలోపే ఉన్నాయి. రెహ‌మాన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తెలుగులోకి బాల‌కృష్ణ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. బాల‌కృష్ణ హీరోగా కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నిప్పుర‌వ్వ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స‌మ‌కూర్చాడు.

ఇదే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రెహ‌మాన్ ఫ‌స్ట్ తెలుగు మూవీ. రెహ‌మాన్ స‌హా ఈ మూవీకి మొత్తం న‌లుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ప‌నిచేశారు. రాజ్‌కోటి, బ‌ప్పిల‌హ‌రి సాంగ్స్ కంపోజ్ చేయ‌గా…రెహ‌మాన్ బీజీఎమ్ అందించారు. ఓవ‌రాల్‌గా రెహ‌మాన్ కెరీర్‌లో ఇది ఐదో మూవీ. రోజా, జెంటిల్‌మెన్ సినిమాల‌కు రెహ‌మాన్ అందించిన బీజీఎమ్ న‌చ్చి కోదండ‌రామిరెడ్డితో పాటు నిర్మాత‌లు ప‌ట్టుప‌ట్టి రెహ‌మాన్‌ను నిప్పుర‌వ్వ‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకున్నారు.

మ‌హేష్ బాబు నాని…ప‌వ‌న్ కొమురం పులి…

రెహ‌మాన్ ఫ‌స్ట్ టైమ్ మ్యూజిక్ అందించిన ఈ తెలుగు మూవీ థియేట‌ర్ల‌లో మాత్రం ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి నిప్పుర‌వ్వ‌ మూవీని తెర‌కెక్కించాడు. రొటీన్ కాన్సెప్ట్ కావ‌డంతో ఫ్యాన్స్ ఈ మూవీని తిర‌స్క‌రించారు.

నిప్పుర‌వ్వ‌తో పాటు తెలుగులో రాజ‌శేఖ‌ర్ గ్యాంగ్‌మాస్ట‌ర్‌, కృష్ణంరాజు ప‌ల్నాటి పౌరుషం, వెంక‌టేష్ సూప‌ర్ పోలీస్‌, మ‌హేష్‌బాబు నాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొమురం పులితో పాటు మ‌రో రెండు సినిమాల‌కు మాత్ర‌మే రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు.

బాల‌కృష్ణ‌…విజ‌య‌శాంతి కాంబో…

నిప్పుర‌వ్వ సినిమాలో బాల‌కృష్ణ‌కు జోడీగా విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించింది. టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ప‌దిహేడ‌వ మూవీ ఇది.

ఇదే బాల‌కృష్ణ‌, విజ‌య‌శాంతి క‌లిసి చేసిన చివ‌రి మూవీ కూడా కావ‌డం గ‌మ‌నార్హం. నిప్పుర‌వ్వ సినిమాలో తొలుత దివ్య‌భార‌తిని హీరోయిన్‌గా తీసుకోవాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఆమె డేట్స్ స‌ర్ధుబాటు కాక‌పోవ‌డంతో విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించింది.

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్‌…

నిప్పుర‌వ్వ సెట్స్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో చాలా రోజుల పాటు షూటింగ్ నిలిచింది. ఒకానొక‌ద‌శ‌లో సినిమా పూర్తిగా ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో సీన్స్ తీస్తుండ‌గా జ‌రిగిన ప్ర‌మాదంలో ఓ ముగ్గురు యూనిట్ స‌భ్యులు మృత్యువాత‌ప‌డ్డారు. ఎలాగోలా నిర్మాత‌లు క‌ష్ట‌ప‌డి సినిమాను రిలీజ్ చేశారు.

నిప్పుర‌వ్వ రిలీజైన అదే రోజు బాల‌కృష్ణ మ‌రో మూవీ బంగారు బుల్లోడు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డింది. ఒకేరోజు రెండు బాల‌కృష్ణ సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ డైరెక్ట‌ర్ బాబీతో ఓ మూవీ చేస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.